మామిడికుదురు: విద్యుత్ పునరుద్ధరించకపోతే పోలింగ్‌ను బహిష్కరిస్తామని మొగలికుదురు గ్రామస్తులు హెచ్చరించారు. అర్నబ్ తుపాను ప్రభావంతో 10 రోజుల నుంచి కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. డ్రైన్లు పూడుకుపోయి ముంపు నీరు నిలవడంతో పాటు మోటార్లు నడవక తాగునీటికి కటకట ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నేడు కార్మికులకు
వేతనంతో కూడిన సెలవు
అమలాపురం రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు గురువారం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
నేడు స్థానిక సెలవు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, బ్యాంకులకు గురువారం స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు సజావుగా కొనసాగించడంతో పాటు ఈ విధుల్లో పాల్గొనే సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
పరిషత్ ఎన్నికలకు
పటిష్ట బందోబస్తు
అమలాపురం టౌన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,070 పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాను 679 సాధారణ, 64 సమస్యాత్మక, 75 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా వర్గీకరించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా 120 రూట్ మొబైల్స్, 21 స్ట్రైకింగ్ ఫోర్సు, 15 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, 5 అడిషనల్ స్ట్రైకింగ్ ఫోర్సు, రిజర్వు బృందాలను రంగంలోకి దించామన్నారు. అత్యవసర సహాయానికి స్థానిక పోలీసులకు లేదా 112 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.


