మడిలో.. ‘కన్నీటి జడి’ | - | Sakshi
Sakshi News home page

మడిలో.. ‘కన్నీటి జడి’

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

అంబాజీపేట: గంగలకుర్రులో నీట మునిగిన వరి చేను

రావులపాలెం: ముమ్మిడివరప్పాడు రోడ్డులో నేలనంటి, నీట నానుతున్న వరి పైరు

● అన్నదాతకు అంతులేని దుఃఖం

● చేతికంది వచ్చిన పంట నోటికందని వైనం

● ‘అర్నబ్‌’తో 1.18 లక్షల ఎకరాల్లో

నేలకొరిగిన వరి

● ‘మురసు’ ప్రభావంతో మళ్లీ భారీ వర్షం

● మొత్తం 1.25 లక్షల

ఎకరాల్లో పంటకు నష్టం

సాక్షి, అమలాపురం: వరుసగా విరుచుకు పడిన అర్నబ్‌, మురసు తుపాన్లు పంటచేలను వాననీటితో ముంచెత్తాయి. చేతికంది వచ్చిన పంట నీట మునగడం చూసి అన్నదాతల కళ్లల్లో కన్నీటి జడి ఆగడం లేదు. వారి దుఃఖానికి అంతే లేకుండా పోతోంది. ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. కాలం కలిసి రాకపోవడంతో కోనసీమ రైతు బతుకు కకావికలమైంది. వరుస విపత్తులతో ఇప్పటికే దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటూండగా.. బుధవారం తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షం వారికి మరింత నష్టం తెచ్చిపెట్టింది.

అర్నబ్‌తో మొదలైన కష్టాలు

గత నెల 27న అర్నబ్‌ తుపాను జిల్లాపై విరుచుకు పడటంతో సుమారు 1.18 లక్షల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలో ఉన్న పంట నేలనంటేయడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో కోతలు చేపట్టలేని దుస్థితి ఏర్పడింది. తడిసిన కంకులు నాణ్యత కోల్పోయే ప్రమాదం నెలకొంది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

భారీ వర్షం.. పెరిగిన నష్టం

అర్నబ్‌ తుపాను కబళించగా మిగిలిన పంటనైనా కాపాడుకోవాలని ఆశ పడిన జిల్లా రైతులను బుధవారం కురిసిన కుండపోత వర్షం దెబ్బ మీద దెబ్బ తీసింది. ఇప్పటికే నేలకొరిగిన చేలు మరింతగా నీట మునిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లోనూ నీరు చేరింది. నీటిలో నానిపోవడంతో వరి కంకులు మొలకెత్తడం, గింజ నాణ్యత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మొత్తం మీద వరుస తుపాన్లు, భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా సుమారు 1.25 లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిన్నట్లు అంచనా వేస్తున్నారు.

అప్పుల ముప్పుపై ఆందోళన

ఆగస్టులో ఆలస్యంగా నాట్లు వేసిన పొలాల్లో ప్రస్తుతం వరి పైరు పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలో ఉంది. ఈ పంట కొంత మేరకు చేతికి వస్తుందని రైతులు ఆశిస్తూండగా తాజా వర్షాలతో ఆ ఆశలకూ గండిపడింది. దిగుబడి తగ్గితే పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, పరిహారం అందించడంతో పాటు, నిబంధనలు సడలించి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు కోరుతున్నారు.

అధికారులు వస్తున్నారు.. వెళ్తున్నారు

అమలాపురం మండలం నడిపూడికి చెందిన ఈ రైతు పేరు అరిగెల నాగ శ్రీనివాసరావు. రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. చేతికి వచ్చే సమయంలో కురిసన భారీ వర్షాలకు పంట నీట మునిగింది. మొత్తం రూ.60 వేల పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు కోత కోయించే పరిస్థితి లేదు. పెట్టుబడి మొత్తం పోయినట్టే. కనీసం ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అయినా వెంటనే ఇస్తే రబీ అయినా సాగు చేయవచ్చని ఆశ పడుతున్నారు. ‘అధికారులు వస్తున్నారు. రాసుకుని వెళ్తున్నారు. పరిహారం మాత్రం రావడం లేదు. ముందు సంవత్సరం కూడా పరిహారం ఇవ్వలేదు’ అని శ్రీనివాసరావు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement