ట్రాన్స్‌కో.. టెన్షన్‌ చూసుకో! | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో.. టెన్షన్‌ చూసుకో!

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

కాట్రేనికోన: అర్నబ్‌ తుపాను బీభత్సం సృష్టించింది.. విద్యుత్‌ వ్యవస్థను అతలాకుతలం చేసింది.. అయితే వీటి పునరుద్ధరణ పనుల్లో నాణ్యతా లోపం బహిర్గతమవుతోంది. తుపాను ధాటికి నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, తెగిపోయిన తీగల పునరుద్ధరణలో అధికారులు తగిన ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కాట్రేనికోన మండలంలో పర్యటించిన సందర్భంలో రెండు రోజుల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించినా, వారం రోజులు పైబడినా శివారు గ్రామాలకు సరఫరా లేక ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. కాట్రేనికోన సబ్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పూడి, నీళ్లరేవు, కాట్రేనికోన, పల్లంకుర్రు –బలుసుతిప్ప, పల్లంకుర్రు –లైనుపేట, పల్లం, కందికుప్ప– లైట్‌హౌస్‌, చెయ్యేరు– కాట్రేనికోన విద్యుత్‌ లైన్లు ఈదురు గాలులకు స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపోవడంతో విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మండల కేంద్రం కాట్రేనికోనతో పాటు చెయ్యేరు, కందికుప్ప ప్రధాన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరించినప్పటికీ, పలు శివారు గ్రామాల్లో పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు.

ఆ తొమ్మిది కిలోమీటర్లు..

గచ్చకాయలపోర నుంచి నీళ్లరేవు వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని సమాచారం. సముద్ర తీర ప్రాంతం కావడంతో ఉప్పు గాలులు, ఇసుక నేల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసేటప్పుడు పటిష్టమైన కాంక్రీట్‌ పునాదులు నిర్మించాల్సి ఉంది. గతంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తుపాను గాలులకు స్తంభాలు భారీ సంఖ్యలో నేలకొరిగాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

మళ్లీ అదే తప్పు

ప్రస్తుతం చేపడుతున్న పునరుద్ధరణ పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్రాలతో గుంతలు తీసి స్తంభాలు పాతుతున్నారే తప్ప, వాటికి పటిష్టమైన సిమెంట్‌ కాంక్రీట్‌ బేస్‌ నిర్మించడం లేదని స్థానికులు అంటున్నారు. స్తంభాల చుట్టూ రాళ్లు కూడా సక్రమంగా అమర్చడం లేదని, మొక్కుబడిగా పనులు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. తీర ప్రాంతాల్లో బలమైన గాలులను తట్టుకునేలా పునాదులు నిర్మించకపోతే భవిష్యత్తులో మరోసారి తుపానులు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిర్రయానం వెళ్లే రహదారి వెంబడి ఇసుక నేలపై గతంలో సిమెంట్‌ కాంక్రీట్‌ దిమ్మలు వేయకపోవడంతో విద్యుత్‌ స్తంభాలు గాలులకు వాలిపోవడంతో మేతకు వచ్చిన ఆరు పాడి గేదెలు విద్యుత్‌ తీగలకు తగిలి మృత్యువాత పడ్డాయి. కుటుంబ పోషణకు ఆధారమైన పాడి గేదెల మృతితో సంబంధిత రైతు తీవ్రంగా నష్టపోయారు. ఈ రహదారిపై మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేందుకు రాత్రివేళల్లోనూ రాకపోకలు సాగిస్తుంటారు. వేలాడుతున్న విద్యుత్‌ తీగలతో ప్రాణాపాయం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ లైనే గతి

1996 తుపాను పునరుద్ధరణ పనులతో ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు, కాసారాలు, విద్యుత్‌ తీగలు ఉప్పు గాలులకు తుప్పు పట్టిపోయాయి. విరిగిపోతున్న కాలం చెల్లిన తీగలు, తుప్పుపట్టిన పాత పరికరాలు బలమైన గాలులకు తెగిపోతూ ఉంటాయి. అర్నబ్‌ తుపానుతో దెబ్బతిన్న 11 కేవీ విద్యుత్‌ లైన్లను పూర్తి స్థాయిలో కొత్త స్తంభాలు, నాణ్యమైన కొత్త తీగలను వేసి పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉండగా, విరిగిన పాత తీగలకే జాయింట్లు వేసి విద్యుత్‌ లైన్‌ సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్టీ లైన్‌ వెంబడి వాలిపోయిన, గాలిలో ఊగుతున్న స్తంభాలను మార్చకుండా తీగలు వేస్తున్నారని అంటున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు గాలులకు వేట్లపాలెం, రాజానగరం, నాగపట్టణం, గచ్చకాయలపోర, చిర్రయానం, నీళ్లరేవు, పల్లం, కొత్తపాలెం, మొల్లేటిమొగ, పోర, బలుసుతిప్ప తదితర గ్రామాల్లో 11 కేవీ టాప్‌లీడ్స్‌ తుప్పుపట్టి పాడైపోయాయని, వీధి లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొత్త కేబుల్‌ వేయాలని స్థానికులు కోరుతున్నారు.

విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో

నాణ్యతా లోపం

కాంక్రీట్‌ బేస్‌ లేకుండానే

స్తంభాల ఏర్పాటు

పాత తీగలకే జాయింట్లు

పట్టించుకోకుంటే మళ్లీ ముప్పే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement