చిట్టి తల్లి.. ఎక్కడున్నావ్‌..! | - | Sakshi
Sakshi News home page

చిట్టి తల్లి.. ఎక్కడున్నావ్‌..!

Oct 24 2026 12:34 AM | Updated on Oct 24 2026 12:34 AM

ఫ సముద్రంలో గల్లంతైన బాలిక కోసం

తల్లిదండ్రుల రోదన

ఫ పెరుమాళ్లపురం బీచ్‌లో ఘటన

తొండంగి: అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. నువ్వే ఇంటికి వెలుగు అనుకున్నాం.. మా చిట్టితల్లి ఎక్కడున్నావ్‌.. అంటూ సముద్రంలో గల్లంతైన ఓ బాలిక కోసం తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఓ పుట్టినరోజు వేడుకకు వెళ్లి, తర్వాత రోజు సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు సురక్షితంగా కొట్టుకురాగా, ఓ బాలిక గల్లంతైన ఘటన పెరుమాళ్లపురం బీచ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన చీకట్ల నానిబాబుకు భార్య కామేశ్వరి, కుమార్తె యశ్వంతిక (12), కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. నానిబాబు తాపీమేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తె యశ్వంతిక కాకినాడ సమీపంలో పండూరు వద్ద అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. దసరా సెలవులకు గురుకుల పాఠశాల నుంచి ఎండపల్లి వచ్చింది. గురువారం నానిబాబు బావమరిది కుమారుడు పుట్టినరోజు వేడుకల కోసం భార్య కామేశ్వరి, యశ్వంతిక, యశ్వంత్‌లు బంధువులతో కలిసి దుర్గాడ గ్రామానికి వెళ్లారు. పుట్టిన రోజు వేడుకల్లో ఎంతో సరదాగా గడపారు. అందరినీ నవ్వుతూ పలకరించారు.

మరుసటి రోజు ఇలా..

కాగా శుక్రవారం యశ్వంతిక బంధువులైన చీకట్ల మాధవి, ఎం.శ్యామల మరికొంత మంది బంధువులు కలసి పెరుమాళ్లపురం బీచ్‌కు సముద్ర స్నానం చేసేందుకు వెళ్లారు. సముద్రంలో అలల ఉధృతికి ముగ్గురూ మునిగిపోయారు. శ్యామల, మాధవిలు బయటకు రాగా యశ్వంతిక గల్లంతైంది. దీంతో స్థానిక మత్స్యకారులు ఆ బాలికను వెతికేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ సంఘటనతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

దసరా సెలవులకు వచ్చి శాశ్వతంగా సెలవు పెట్టి వెళ్లిపోయావమ్మా అంటూ తల్లిదండ్రులు కామేశ్వరి, నానిబాబు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కుమార్తె గల్లంతైన ఘటనపై నానిబాబు తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement