కాకినాడ రూరల్: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఓ విద్యార్థిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. పండూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుత్తులవారిపాలెం గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని టేకుముడి తనుశ్రీ (16) మృతి చెందింది. కాకినాడలోని ప్రైవేట్ కళాశాలలో తనుశ్రీ ఇంటర్ చదువుతోంది. ఉదయం ఆమెను కళాశాల వద్ద దించేందుకు తల్లి సత్యశ్రీ స్కూటీపై తీసుకు వెళుతుండగా, పండూరు ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి ట్రాక్టర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ స్కూటీని ఢీకొంది. తల్లీకుమార్తెలు రోడ్డుపై పడిపోయారు. తనుశ్రీ పైనుంచి ట్రాక్టరు దూసుకుపోయింది. ఆమె తీవ్రంగా గాయపడగా పవర జంక్షన్ వద్ద ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రమాదం నుంచి సత్యశ్రీ ప్రాణాలతో బయటపడింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ ట్రాక్టర్ ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి
ఫ తల్లితో స్కూటీపై కళాశాలకు
వెళుతుండగా ఘటన


