ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి నవంబర్ 6 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్ ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. శేష వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో ఆలయంలో ఆర్జిత సేవలు, సామూహిక అష్టోత్తర పూజలు, ఐశ్వర్య లక్ష్మీ హోమాలు, కల్యాణాలు రద్దు చేశామన్నారు.
నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు
అమలాపురం టౌన్: అమలాపురం దసరా ఉత్సవాల్లో ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబును కత్తితో పొడిచి దాడికి పాల్పడిన నిందితులపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఎస్సైపై దాడికి పాల్పడిన కొంకాపల్లి దసరా ఉత్సవ కమిటీకి చెందిన ఐదుగురిని ప్రధాన నిందితులుగా, మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
ఉరేసుకుని ఒడిశా వాసి మృతి
చింతూరు: స్థానిక వినాయకుడి గుడి ముందు భాగంలో ఉన్న వరండాలో ఐరన్ పైపునకు ఉరేసుకుని ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా తోపగూడకు చెందిన గంగా మాడి (54) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం కలకలం రేపింది. గురువారం రాత్రి గుడి వద్దకు వచ్చిన సదరు వ్యక్తి దేవుడిని దర్శించుకుని వెళ్లాడని, ఉదయం చూసేసరికి వరండాలో ఐరన్ దూలానికి ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభం విరిగిపడి వ్యక్తి మృతి
కొత్తపల్లి: ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభం విరిగిపడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన ముప్పిడి నూకరాజు (80) తన ఇంటి వద్ద అరుగు వద్ద టిఫిన్ చేస్తుండగా, చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. ఆ విద్యుత్ స్తంభం నూకరాజుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


