గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

Sep 25 2026 12:17 AM | Updated on Sep 25 2026 12:17 AM

● విద్యుత్‌ వైర్లకు తగిలిన బరకం

● షాక్‌తో యువకుడి మృతి

● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

● బి.దొడ్డవరంలో ఘటన

మామిడికుదురు: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా బి.దొడ్డవరం గ్రామంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, నగరం ఎస్సై ఎ.పద్మారావు బుధవారం తెలిపిన వివరాలివీ.. గ్రామం ఎంట్రన్స్‌లో ఉన్న వినాయకుని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం నిమజ్జనం ఊరేగింపును బుధవారం ఘనంగా ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసి, భక్తులు ట్రాక్టర్‌పై రాత్రి తిరిగి వస్తున్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపానికి వచ్చేసరికి ఆ ట్రాక్టర్‌లోని డీజే బాక్సులపై వేసిన బరకం గాలికి ఎగిరి 11 కేవీ విద్యుత్‌ తీగలకు తాకింది. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాక్టర్‌ టైర్లకు సైతం మంటలు వ్యాపించాయి. దానిపై ఉన్న ముమ్మిడివరం మండలం అయినాపురానికి చెందిన ఇళ్ల సాయిచందు (25), అల్లవరం మండలం తూర్పులంకకు చెందిన బడుగు దుర్గాప్రసాద్‌, పంపాని వీర సాయి శంకర్‌ ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌కు గురై, కిందకు దూకేశార. తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురినీ అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిచందు మృతి చెందాడు. మరో బాధితుడు దుర్గాప్రసాద్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడు సాయిచందు తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవివాహితుడైన సాయిచందు మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అంది వచ్చిన కొడుకు దూరమయ్యాడని పెద్ద పెట్టున రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement