కొండంత భారం తగ్గాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

కొండంత భారం తగ్గాల్సిందే!

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

చెక్కుల బౌన్స్‌పై ఆగ్రహం

వివిధ వ్యాపారస్తులు ఇచ్చిన సుమారు 20 చెక్కులు బౌన్స్‌ కావడంపై ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కు బౌన్స్‌ అయిన సందర్భంగా ఆ వ్యాపారులు డబ్బును జమ చేయకపోతే వారిపై కేసులు వేయాలని సూచించారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

అన్నవరం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో సభ్యుల తీర్మానం

‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై చర్చ

లీజు బకాయి ఫైళ్ల పరిశీలన

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో షాపుల లీజుదారులు బకాయిలు చెల్లించకపోతే వెంటనే షాపులను మూసివేయించాలని దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులు ఆదేశించారు. చైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో వివిధ షాపులను టెండర్‌ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు తీసుకున్న వ్యాపారస్తులు దేవస్థానానికి రూ.నాలుగు కోట్లు బకాయి పెట్టారని ‘సాక్షి’ పత్రికలో కొండంత భారం శీర్షికన శనివారం ప్రచురితమైన వార్త ఆధారంగా చర్చ జరిపారు. కాఫీ మెషీన్ల షాపుల నుంచి పూజా ద్రవ్యాల దుకాణాల వరకు అన్ని వ్యాపారాల బకాయిలుపై ట్రస్ట్‌ బోర్డు సభ్యులు సమీక్షించారు. వచ్చే సమావేశం నాటికి బకాయిలన్నీ వసూలు చేయాలని ఆదేశించారు. కాగా.. ఈ నెలలో రూ.2.60 కోట్ల బకాయిలు వసూలు చేశామని అధికారులు తెలిపారు. ఆ మొత్తంలో కొత్తగా వేలం జరిగిన రెండో నెంబర్‌ పూజా ద్రవ్యాల షాపు పాడిన నిర్వాహకుడు జమ చేసిందే రూ.1.20 కోట్లు ఉండడం విశేషం.

ఇతర తీర్మానాలు

ఫ సత్యగిరిపై విష్ణుసదన్‌ ఉత్తరం వైపుగల ఖాళీ స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 300 గదుల సత్రం నిర్మాణానికి టీటీడీ ఈవోను కోరుతూ తీర్మానం చేశారు.

ఫ దేవస్థానం కళాశాల విద్యార్థులకు దేవస్థానం నిధులతో మధ్యాహ్న భోజనం పెట్టాలని తీర్మానించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి దాతలు ఇచ్చిన విరాళాల నుంచి మధ్యాహ్న భోజనం పెట్టడానికి గతంలో తీర్మానించి ఈ నెల రెండో తేదీ నుంచి మూడు రోజులు అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అన్నదానం నిధుల వినియోగంపై విమర్శలు రావడంతో నిలిపివేశారు.

ఫ రత్నగిరిపై 23 అడుగుల ఎత్తు కలిగిన గరుడ విగ్రహాన్ని కాంక్రీట్‌తో నిర్మించేందుకు కాకినాడకు చెందిన దాత లింగంగుంట సుమలత ముందుకు వచ్చినందున, దీనిపై నిర్ణయాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేశారు.

ఫ ప్రముఖ దాతలు, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు మట్టే సత్యప్రసాద్‌, ఎంఎస్‌ రెడ్డిలకు ట్రస్ట్‌బోర్డు సమావేశం అజెండా పంపకపోవడంపై సభ్యుడు రావిపాటి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

ఫ ఆలయ ప్రాకారంలో అగరవత్తుల విక్రయ షాపు, నిర్మాల్య పత్రితో తయారు చేసే ఉత్పత్తుల విక్రయించే షాపుతో భక్తులకు అసౌకర్యంగా ఉన్నందున వీటి లీజు రద్దు చేసే విషయాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేశారు.

ఫ ఈఓ కార్యాలయం దిగువన గల పాత మెయిన్‌ క్యాంటీన్‌ను సేవా కార్యకర్తలకు వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సభ్యులుతీర్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement