విద్యుత్‌ తీగల దొంగలు దొరికారు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగల దొంగలు దొరికారు

Jul 28 2026 12:13 AM | Updated on Jul 28 2026 12:13 AM

రెండు కేసుల్లో 9 మంది అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన

సీఐ వీరయ్య గౌడ్‌

రాజానగరం: వెలుగుబంద, పాలచర్ల తదితర ప్రాంతాల్లోని లేఅవుట్లలో ఉన్న విద్యుత్‌ స్తంభాల నుంచి తీగలను, పొలాల్లో బోర్ల వద్ద ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ వైర్‌ను చోరీ చేస్తున్న రెండు ముఠాలను పట్టుకున్నామని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్‌ తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మంగి సుధాకరరెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా రంగినిగూడకు చెందిన కిల్లో రాజు, బోండాంకు చెందిన పొంగి విజయ్‌, బసికి చెందిన కొర్రా ప్రహ్లాదలను ఒక కేసులో అరెస్ట్‌ చేశామన్నారు. వీరు గత ఏడాది నుంచి రాజానగరం, సీతానగరం, కొవ్వూరు మండలాల్లోని విద్యుత్‌ స్తంభాల నుంచి తీగలను కత్తిరించి అపహరిస్తున్నారని, వీరిపై జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు. నిందితుల నుంచి రూ.3,57,500 విలువైన 1,430 కిలోల అల్యూమినియం కండక్టింగ్‌ వైరును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఫ మరో కేసులో కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన శివగంగ బాబూరావు, నేమవరపు మురళీకృష్ణ, మేడిశెట్టి మణికంఠ, బసమని వీరబాబు, శివగంగ రాజులను అరెస్ట్‌ చేశారని సీఐ తెలిపారు. వీరు కూడా రాజానగరం, సీతానగరం మండలాల్లోని పొలాల వద్ద ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పగలకొట్టి, దానిలోని కాపర్‌ వైర్‌ను దొంగిలిస్తున్నారన్నారు. తోటల్లో ఉండే గెస్ట్‌ హౌస్‌ల వద్ద, లేఅవుట్లలోని విద్యుత్‌ స్తంభాల నుంచి తీగలను కత్తిరించి అపహరిస్తున్నారని తెలిపారు. వీరిపై జిల్లాలో 9 కేసులు నమోదు కాగా రాజానగరం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఏడు కేసులు ఉన్నాయన్నారు. వీరి నుంచి 361 కేజీల అల్యూమినియం తీగలను కరిగించి తయారు చేసిన దిమ్మలు, 23 కేజీల రాగి దిమ్మలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఒక ఆటో, రెండు బైకులను స్వాధీనపర్చుకున్నామని వివరించారు. ఎస్సై ప్రియకుమార్‌ ఆధ్వర్యంలో ఈ రెండు కేసులలో చోరులనుచాకచక్యంగా పట్టుకున్నారని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement