ఫ క్లే మోడలింగ్ పోటీల్లో ప్రథమ స్థానం
ఫ అభినందించిన హెచ్‌ఎం, ఉపాధ్యాయులు
రంగంపేట: రాష్ట్ర స్థాయి క్లే మోడలింగ్ పోటీల్లో రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. కాకినాడ జిల్లా కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో ఈ నెల 26న వరల్డ్ వైల్డ్ ఫారెస్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యాంగ్రోవ్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన సత్య, జ్ఞాన, లక్ష్య, కార్తీక, సంతోషిణితో కూడిన బృందం ఆ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిందని ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థినులకు శిక్షణ అందించిన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు రమ్యసుధ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. తమ విద్యార్థినులు కోరింగ ఆవరణ వ్యవస్థ అంశంపై క్లే మోడల్‌ను రూపొందించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుని ప్రథమ బహుమతిని సాధించారని వివరించారు. విజేత విద్యార్థినులను, గైడ్ టీచర్ రమ్యసుధను మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా అభినందించారు.


