పెరవలి: కట్టుకున్న భర్త మృతి చెందాడు, చేతికంది వచ్చిన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. కొవ్వూరు పట్టణంలో చెత్త వ్యాన్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన మోస మణికంఠ (19) పెయింటింగ్, కూలి పనులు చేసుకుంటూ తల్లిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం పని ముగించుకుని మోటారు సైకిల్‌పై ఇంటికి వస్తున్న అతడిని మున్సిపాలిటీకి చెందిన చెత్త వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మణికంఠను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లి నాగమణి విలపిస్తూ ఆసుపత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. తండ్రి లేకపోయినా ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన కుమారుడు ఆసరాగా ఉన్న సమయంలో భగవంతుడు తీసుకుపోయాడని, తాను ఎవరి కోసం బతకాలి అంటూ దీనంగా రోదించింది.
డ్రైవర్ లేకపోవడంతో..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ చెత్త వ్యాన్‌ను అనుభవం ఉన్న డ్రైవర్ కాకుండా మున్సిపాలిటీ సిబ్బంది నడిపినట్టు తెలిస్తోంది. ఆ వ్యాన్‌కు శాశ్వత డ్రైవర్ లేకపోవటంతో పారిశుధ్య కార్మికులే నడుపుతున్నారని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.


