రాజానగరం: దేశంలోని ప్రకృతి సంపదను పరిరక్షించడంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల (ఎఫ్‌బీవో)ల పాత్ర కీలకమని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ వీసీ డాక్టర్ ధనుంజయరావు అన్నారు. అటవీ సంపదను కాపాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నారన్నారు. లాలాచెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఎఫ్‌బీవోలకు సోమవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ధనుంజయరావు మాట్లాడుతూ పర్యావరణ స్థిరత్వానికి, వాతావరణ సహనశీలతకు వ్యవసాయం, ఉద్యానం, అడవులు అనుసంధానమైన మూలస్తంభాలన్నారు. ఈ క్రమంలో అటవీ శాఖతో తమ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకోవాలని భావిస్తుందన్నారు. అకాడమీ డైరెక్టర్ బి.విజయ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కి నూతనంగా ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అలా 2017 నుంచి ఇప్పటివరకు అకాడమీలో 878 మంది అటవీ ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అకాడమీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


