ఐ.పోలవరం: లీప్ పాఠశాలగా ఐ.పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్తింపు పొందడం అభినందనీయమని ఎమ్మెల్యే, విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ
ఏర్పాట్లపై సమీక్ష
అమలాపురం రూరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాలతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వివిధ సమస్యలపై 94 అర్జీలు
ఐ.పోలవరం: ఒక నెల – ఒక గ్రామం – నాలుగు పర్యటనలు కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 94 అర్జీలను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి స్వీకరించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఆర్‌డీవో సరళావతి, డీఆర్‌డీఏ డి.రాంబాబు, డిప్యూటి కలెక్టర్ కె.అచ్యుత కుమారి పాల్గొన్నారు.
మట్టి వాహనాల అడ్డగింపు
అయినవిల్లి: మండలంలోని మడుపల్లి నుంచి చింతనలంక లాకులు మీదుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 15 రోజులుగా అక్రమార్కులు ఇక్కడ మట్టి తవ్వకాలు చేస్తున్నారని, రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఏటిగట్టు రోడ్డును ధ్వంసం చేయడంతో పాటు మట్టి వాహనాలను అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
అంతర్రాష్ట్ర
దొంగల ముఠా అరెస్టు
● 241 గ్రాముల బంగారుఆభరణాల స్వాధీనం
● జీఆర్పీ డీఎస్పీ ప్రమోద్
రాజమహేంద్రవరం సిటీ: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 241 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు స్థానిక జీఆర్పీ డీఎస్పీ కె.ప్రమోద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్, జూలై నెలల్లో నమోదైన రెండు హ్యాండ్‌బ్యాగ్ చోరీ కేసులలో దర్యాప్తు అనంతరం వీరిని పట్టుకున్నట్టు తెలిపారు.


