ఆదాయానికి పెన్‌ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఆదాయానికి పెన్‌ముప్పు

Jul 25 2026 12:11 AM | Updated on Jul 25 2026 12:11 AM

లేఖర్ల పెన్‌డౌన్‌తో భారీగా

తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు

ప్రభుత్వ ఆదాయానికి గండి

వెలవెలబోతున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

కొత్తపేట: భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్‌ పేరుతో చేపట్టిన నిరవదిక సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ, ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లతో పాటు రిజిస్ట్రేషన్లపై ఆధారపడిన డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్‌ వెండర్లు సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఆధారపడి సుమారు 600 మంది దస్తావేజు లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్‌ వెండర్లు, సహాయకులతో పాటు జిరాక్స్‌ సెంటర్ల నిర్వాహకుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకురావడం వల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని లేఖర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం వచ్చేది ఇలా..

జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, వాటిలో అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు, ఆలమూరు కార్యాలయాల్లో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ నెల 17న (శుక్రవారం) 336 రిజిస్ట్రేషన్లు కాగా రూ.82.05 లక్షల ఆదాయం వచ్చింది. 18న అత్యధికంగా 548 రిజిస్ట్రేషన్లు జరగ్గా, వాటి నుంచి రూ.3.56 కోట్లు సమకూరింది. ఆ విధంగా జిల్లాలో రోజుకు సరాసరి 250 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా రూ.2 కోట్లు ఆదాయం వస్తుంది.

తగ్గిన రిజిస్ట్రేషన్లు

ఈ నెల 20 నుంచి దస్తావేజు లేఖర్ల నిరవదిక సమ్మెతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. జిల్లాలో 20న ఒక్క (ఆత్రేయపురం) రిజిస్ట్రేషన్‌ జరగ్గా రూ.58,640, 21న 2 (కొత్తపేట, అంబాజీపేట) జరగ్గా రూ.14,760, 22న ఒకటి (ఆత్రేయపురం) రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర బాండ్లతో రూ.17,230, 23న ఐ.పోలవరంలో 2 రిజిస్ట్రేషన్లకు రూ.1,75,100 ఆదాయం వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement