సఖినేటిపల్లి: విశాఖపట్నంలో ఆగస్టు 2న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సాహిత్య, సాంస్కృతిక వైభవోత్సవాలు ఏర్పాటు చేసినట్టు వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తెలిపారు. శుక్రవారం సఖినేటిపల్లిలో ఆయన మాట్లాడుతూ 170వ జాతీయ స్థాయి సాహిత్య, సాంస్కృతిక వైభవోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విశాఖ క్రాంతి కిరణాలు పేరిట నిర్వహించే ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి కవులు, రచయితలు, అభిమానులు తరలిరానున్నట్టు ప్రతాప్ పేర్కొన్నారు.
9 ప్రైవేట్ బస్సులపై కేసులు
రావులపాలెం: నిబంధనలు పాటించని తొమ్మిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా రవాణాఽశాఖ అధికారి డి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. మండలంలోని ఈతకోట టోల్ ప్లాజా వద్ద 34 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా నిబంధనలు పాటించని 9 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.16 వేలు అపరాధ రుసుము విధించామన్నారు.
యువతిని బెదిరించిన
ఘటనపై ఫిర్యాదు
సఖినేటిపల్లి: మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డుపై వెళుతున్న యువతి ఓ ఇద్దరు యువకులు చెయ్యి పట్టుకుని బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన యువతిని అడ్డగించి ఎక్కడకు వెళుతున్నావ్, నిన్ను కిడ్నాప్ చేస్తాం, మీ తాత మాతో గొడవలు పెట్టుకుంటున్నాడు, ఈ విషయం ఎవరికై నా చెబితే మీ అంతు తేలుస్తాం అని బెదిరించినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు.


