21, 22 తేదీల్లో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు | - | Sakshi
Sakshi News home page

21, 22 తేదీల్లో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 8:37 AM

21, 22 తేదీల్లో ఏఐటీయూసీ  జిల్లా మహాసభలు

21, 22 తేదీల్లో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు

అమలాపురం టౌన్‌: అమలాపురంలోని ప్రెస్‌ క్లబ్‌ భవనంలో మార్చి 21, 22 తేదీల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహా సభలు నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కె.సత్తిబాబు తెలిపారు. ఈ మహా సభల విజయవంతానికి ఏఐటీయూసీ అనుబంధ సంఘాలైన కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమలాపురంలోని గొల్లగూడెంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్షతన బుధవారం జరిగిన పలు కార్మిక సంఘాల సమావేశంలో సత్తిబాబు మాట్లాడారు. ఈ జిల్లా మహా సభల నిర్వహణకు ముందస్తుగా ఈ నెల 27న అమలాపురంలోని వెంకటేశ్వర ఫ్లాజాలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యులు ఊటాల వెంకటేష్‌. బొలిశెట్టి గౌరీశంకర్‌, కామిరెడ్డి చంద్రరావు, గూడాల వెంకటరమణ, పసుపులేటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

3న అంతర్వేది

ఆలయం మూసివేత

సఖినేటిపల్లి: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి అంతర్వేది ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. ఆ రోజు జరగాల్సిన ఆర్జిత సుదర్శన హోమం రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. 4వ తేదీన సంప్రోక్షణ అనంతరం వేకువజామున 5.30 గంటల నుంచి యథాతథంతా ఆర్జిత సేవలు, దర్శనాలు, హోమం జరుగుతాయన్నారు.

నిధుల దుర్వినియోగంపై

లోకాయుక్త సీరియస్‌

కర్నూలు (సెంట్రల్‌): రామచంద్రపురం మునిసిపాలిటీలో ఆస్తి అసెస్‌మెంట్లు, పన్ను వసూళ్లు, ఇంజినీరింగ్‌ పనులకు సంబంధించిన ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కర్నూలులోని లోకాయుక్త సీరియస్‌ అయింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు నిధుల రికవరీకి ఉప లోకాయుక్త జస్టిస్‌ పి.రజనీ ఆదేశించారు. జంపన శ్రీనివాస్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ చేపట్టి బుధవారం తీర్పు చెప్పింది. అప్పటి ఏ1 క్లర్కు సంపత్‌ కుమార్‌ గాంధీ, జూనియర్‌ అసిస్టెంట్‌ గుబ్బల శ్రీనివాసరావులకు రెండు వార్షిక గ్రేడు ఇంక్రిమెంట్లను నిలుపుదల చేసింది. రికార్డు అసిస్టెంట్‌ జి.అమ్మాజీకి సంబంధించి రూ.1,37,509 రికవరీతో పాటు మూడు వార్షిక గ్రేడు ఇంక్రిమెంట్లను నిలుపుదల చేసింది. విశ్రాంత అధికారులు ఎం.జీవరత్నం, ఎన్‌ఎస్‌ అప్పన్న, అప్పటి మునిసిపల్‌ అధికారులు సిద్ధ మోహనరావు, ఆర్‌ఐ ఇట్లూరి సుబ్బారావులకు పెన్షన్‌లో ఐదు శాతాన్ని శాశ్వతంగా నిలుపుదల చేసింది. అంతేకాక ఇట్లూరి సుబ్బారావు నుంచి రూ.6,79,349 రికవరీకి ప్రతిపాదించారు.

కల్తీ పాల ఘటనకు చంద్రబాబు

బాధ్యత తీసుకోవాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కల్తీ పాల వల్ల రాజమహేంద్రవరంలో జనం మృతి చెందిన ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబే తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం, అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. పాల కేంద్రాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. కానీ సంవత్సరాల తరబడి తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను ఈ పాటికే సస్పెండ్‌ చేయాలన్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు అతి ప్రచారం వల్ల 29 మంది చనిపోయారన్నారు. ఇటీవల సింహాచలం, తిరుమల, శ్రీకాకులం వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు చనిపోయారన్నారు.

ప్రవీణ్‌ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వాలు చేసిన హత్యేనని హర్షకుమార్‌ అన్నారు. ప్రవీణ్‌ను ఎవరు హత్యచేశారో, ఎందుకు చేశారో కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలుసునన్నారు. ఒక పాస్టర్‌ తాగుతూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే, దానిపై మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు పలుమార్లు వ్యాఖ్యానించడం కోర్టును ప్రభావితం చేయడమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement