ర్యాంకుల ప్రహసనం
అన్నవరం: ఒక వారం ఒక రాశికి వచ్చిన ఫలితం తరువాతి వారం మరో రాశికి కనిపిస్తుంది. ఇలా 12 రాశుల వారఫలాలు అటూ ఇటూ మారతాయి తప్ప పెద్దగా మార్పు ఉండదని కొంతమంది చమత్కరిస్తూంటారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ఐవీఆర్‌ఎస్ సర్వే పేరిట ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకులు కూడా ఇలాగే ఉంటున్నాయి తప్ప పెద్దగా మార్పు కనిపించడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సర్వే పేరిట ప్రతి నెలా ప్రభుత్వం ర్యాంకులు విడుదల చేసి చేతులు దులిపేసుకుంటోంది తప్ప.. దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ఈ సర్వేలు ఓ ప్రహసనంగా మిగిలిపోతున్నాయి.
అన్నవరం.. ఈసారి నాలుగో స్థానం
జనవరి 25 నుంచి ఈ 21వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానం 75 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. గత జనవరిలో మూడో స్థానంలో నిలవగా ఈసారి ఒక ర్యాంకు తగ్గింది. అయితే, అన్ని విభాగాల్లోనూ సంతృప్తి శాతం పెరగడం విశేషం. జనవరిలో 25.9 శాతం మంది భక్తులు అన్నవరం దేవస్థానంపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఈసారి అది 25 శాతానికి తగ్గింది. ద్వారకా తిరుమల దేవస్థానం కేవలం ఒక్క శాతం అంటే 76 శాతం మంది భక్తుల సంతృప్తితో ఈసారి ప్రథమ స్థానంలో నిలిచింది. 67.2 శాతంతో శ్రీశైలం దేవస్థానం ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశేషమేమిటంటే మిగిలిన ఐదు దేవస్థానాల్లో కూడా భక్తుల సంతృప్తి శాతంలో ఒకటి రెండు పాయింట్లు తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు. దీనినిబట్టి ఈ ఏడు దేవస్థానాల్లోనూ అందిస్తున్న సేవలపై 25 శాత మందికి పైగా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టే.
కానరాని దిద్దుబాటు
ఫ వాస్తవానికి ఐవీఆర్‌ఎస్ సర్వేల పేరుతో ప్రభుత్వం హడావుడి చేసి, ర్యాంకులు ప్రకటిస్తోందే తప్ప తక్కువ ర్యాంకులు వచ్చిన దేవస్థానాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఈ సర్వేల వలన ఎటువంటి ఉపయోగమూ ఉండటం లేదు. ఫలితంగా దీనికోసం చేస్తున్న ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది.
ఫ ఈ ఏడు దేవస్థానాల్లోనూ పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టును సీఎం బంధువు అయిన భాస్కర నాయుడుకు చెందిన పద్మావతి హాస్పిటాలిటీ సంస్థ దక్కించుకుంది. దీంతో, ఆ సంస్థ ఏం చేస్తే అదే పారిశుధ్యం అనే పరిస్థితి నెలకొంది. ఏ దేవస్థానంలోనైనా ఆ సంస్థపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే సీఎంఓ నుంచి ఫోన్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేనప్పటికీ ఏ ఒక్క అధికారి ప్రశ్నించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు నాసిరకం శానిటరీ మెటీరియల్ వాడుతున్నారనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి.
ఫ తక్కువ ర్యాంకులు వస్తున్న దేవస్థానాలపై కనీసం నెలకొకసారైనా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సమీక్షలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు, ప్రధాన కార్యాలయంలో సమావేశాలతో పెద్డగా ప్రయోజనం ఉండటం లేదు.
అన్నవరం దేవస్థానంలో ఈ నెలలో భక్తుల సంతృప్తి శాతం ఇలా..
సేవలు జనవరి ఫిబ్రవరి
సత్యదేవుని దర్శనం 69.9 77.8
మౌలిక వసతులు 71.4 71.4
గోధుమ నూక ప్రసాదం
నాణ్యత 82.3 81.6
పారిశుధ్యం 66.9 69.6
ఫ దేవాలయాల్లో ఐవీఆర్‌ఎస్
సర్వే పేరిట హడావుడి
ఫ ర్యాంకుల విడుదల
ఫ పలు సేవలపై భక్తుల అసంతృప్తి
ఫ దిద్దుబాటు చర్యలు చేపట్టని ప్రభుత్వం
అన్ని విభాగాల్లోనూ తనిఖీలు
అన్నవరం దేవస్థానంలో ప్రతి విభాగాన్నీ తనిఖీ చేసి, భక్తులకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి వారం అన్నదానం, ప్రసాద విభాగాలను తనిఖీ చేసి, నాణ్యతపై పరిశీలన చేసి, తగు ఆదేశాలిస్తున్నాం. పారిశుధ్య విభాగంలో కూడా భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలందించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. రానున్న రోజుల్లో దేవస్థానం ర్యాంకు మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకుంటాం.
– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
ర్యాంకుల ప్రహసనం


