కౌలురైతులకు పెట్టుబడిసాయం ఇవ్వాలని డిమాండ్
అమలాపురం రూరల్: జిల్లాలో కౌలురైతులకు తక్షణమే పంటకు పెట్టుబడిసాయం రూ.20 వేలు ఇవ్వాలని, 2019 కౌలుచట్టం రద్దుచేసి నూతన కౌలుచట్టం తేవాలని, భూ యజమానులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక నిరసన దీక్షల్లో భాగంగా అమలాపురం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సోమవారం రాష్ట్ర కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సీఐటీయూ అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ ప్రారంభించారు.
ఈ దీక్షలకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పాము బాలయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మలక సుభాషిని, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరరావు, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ తులసి దుర్గారావు మద్దతు తెలియజేశారు. వారు మాట్లాడుతూ మొంథా తుపాను పంటనష్ట పరిహారం రూ.22.21 కోట్లు తక్షణమే జిల్లాలో రైతులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పితాల రామచంద్రరావు దీక్షకు నాయకత్వం వహించారు. బుంగ సత్యనారాయణ పర్వతాలు కే.భాస్కరరావు, ఉదయభాస్కర్ సత్యనారాయణ కలెక్టరేట్‌లో డీఆర్‌వోకు వినతి పత్రాన్ని సమర్పించారు.


