గౌతమి గుట్టుక్కుమనేనా! | - | Sakshi
Sakshi News home page

గౌతమి గుట్టుక్కుమనేనా!

Feb 23 2026 6:57 AM | Updated on Feb 23 2026 6:57 AM

గౌతమి

గౌతమి గుట్టుక్కుమనేనా!

ఐ.పోలవరం: గోదావరి నదీ పాయల మధ్య ఉన్న దీవి ఐలాండ్‌ పోలవరం (ఐ.పోలవరం). గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయల మధ్య ఉండే ఐలాండ్‌కు వరదల నుంచి రక్షణ కల్పించేందుకు నిర్మించిన ఏటిగట్లు కుంగిపోతున్నాయి. మూడు శతాబ్దాల క్రితం పటిష్టంగా నిర్మించిన గట్లు దెబ్బతినడంతో వరదల సమయంలో గండ్లు పడితే పరిస్థితి ఏమిటని ఐలాండ్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గట్లపై వేసిన గ్రావెల్‌ రోడ్లు దెబ్బతిన్నడం వల్ల రాకపోకలు సాగించలేక రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఐలాండ్‌ ఏటిగట్లు అత్యంత ప్రమాద భరితంగా మారాయి. పటిష్టం చేసి మూడు దశాబ్దాలు కావస్తుండడం.. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో పలుచోట్ల కుంగిపోతున్నాయి. ఏటిగట్లు ఇటు నది వైపు.. అటు పంట కాలువల వైపు దిగబడిపోతున్నాయి. మొత్తం ఐలాండ్‌ చుట్టూ 40.50 కిలోమీటర్ల పొడవునా ఏటిగట్లు ఉన్నాయి. 1996 పెను తుపాను తర్వాత గట్లను ఎత్తు, వెడల్పు చేశారు. అప్పుడు చేయడం వల్లే 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన గోదావరి ఏటిగట్ల పటిష్ట పనుల్లో ఈ గట్లను పటిష్టం చేసే అవకాశం లేకపోయింది. నాడు ఉమ్మడి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం నేడు ఐలాండ్‌ వాసులకు శాపంగా మారింది. స్థానిక అధికారులు కనీసం ఈ గట్ల పటిష్టతకు నివేదిక పంపి ఉంటే 1986 వరద ప్రామాణికంగా ఇక్కడి గట్లు కూడా మూడు మీటర్ల ఎత్తు, దానికి తగ్గ వెడల్పు చేసి ఉండేవారు. అలా కాకపోవడం వల్ల నేటి కుంగుపాటుతో ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రధానంగా మండల పరిధిలోని పాత ఇంజరం, కేశనకుర్రు, పశువుల్లంక మొండి వద్ద గట్లు బలహీనంగా ఉన్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2022లో గోదావరికి రికార్డు స్థాయిలో మూడో అతిపెద్ద వరద వచ్చిన విషయం తెలిసిందే. నాడు జిల్లా యంత్రాంగం ముందస్తుగా చర్యలు తీసుకోకపోయి ఉంటే ఇక్కడ గట్లు బలహీన పడినచోటల్లా గండ్లు పడి ఐలాండ్‌లో మూడు వంతులు వరద ముంపులో చిక్కుకుని ఉండేది.

మండల పరిధిలోని పశువుల్లంక, కొమరగిరి, ఎదుర్లంక, జి.వేమవరం, జి.మూలపొలం, గుత్తెనదీవి, కేశనకుర్రుపాలెంతో పాటు ప్రధానమైన మురమళ్ల గ్రామం గోదావరి ఏటిగట్టుకు ఆనుకునే ఉన్నాయి. గట్లకు ఎక్కడ గండ్లు పడినా ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికై నా ఈ ప్రమాదాన్ని గుర్తించి ఐలాండ్‌ ఏటిగట్లను కోనసీమలోని మిగిలిన ప్రాంతాలలో మాదిరిగానే ఇక్కడ కూడా పటిష్ట పరచాలని ప్రజలు కోరుతున్నారు.

ఏటిగట్ల రోడ్లు అధ్వానం

ఐ.పోలవరం మండలంలో ఏటిగట్ల రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. వీటిలో ఎదుర్లంక నుంచి గుత్తెనదీవి వరకు గౌతమి గట్టు పరిధిలో బీటీ రోడ్డు ప్రధానమైనది. కేశనకుర్రు నుంచి టి.కొత్తపల్లి వరకు ఉన్న గ్రావెల్‌ రోడ్డు మరింత ప్రమాద భరితంగా మారింది. గతంలో ఐలాండ్‌ చుట్టూ బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. దీనివల్ల గట్లు పట్టిష్టం కావడంతో పాటు ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని భావించారు. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు.

అటకెక్కిన రివర్‌ ఫ్రంట్‌ టూరిజం

ఐలాండ్‌ చుట్టూ ఏటిగట్ల రోడ్లను ఆనుకుని పలు ప్రాంతాల్లో రివర్‌ ఫ్రంట్‌ టూరిజం అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఇది కూడా ప్రతిపాదనలకే పరిమితమై నిలిచిపోయింది. ఎదుర్లంక, గుత్తెనదీవి వద్ద రిసార్టుల నిర్మాణంతో పాటు ఐలాండ్‌ను ఆనుకుని ఉన్న గోగుల లంకలో సైతం పర్యటక అభివృద్ధి చేయాలని, రిసార్టులు నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. దీనివల్ల సమీపంలోని సముద్ర సంగమ ప్రాంతం, మడ అడవుల సందర్శన వంటి బ్యాక్‌ వాటర్‌ టూరిజం అభివృద్ధి అభివృద్ధి అయ్యేది. కానీ ఈ ప్రతిపాదనలు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి.

ఏటిగట్లను పటిష్టం చేయాలి

ఐ.పోలవరం చుట్టూ ఉన్న ఏటిగట్లను వెంటనే పటిష్టం చేయాలి. లేకపోతే ఏటా గోదావరికి వచ్చే వరదలప్పుడు ఏమైపోతామో అని భయపడుతున్నాం. భారీ వరదలు వస్తే గట్లకు గండ్లు పడే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది.

– చప్పిడి వెంకటేశ్వరరావు,

పాత ఇంజరం, ఐ.పోలవరం మండలం

గట్లు కుంగి భీతిల్లుతున్న

ఐ.పోలవరం మండలం

గోదారి పాయల మధ్య

ప్రమాదకర పరిస్థితి

వరదలు వస్తే తీవ్ర ముంపు

తప్పదంటున్న ప్రజలు

పటిష్ట పరచకుంటే గండ్లు పడే ప్రమాదం

ప్రతిపాదనలకే పరిమితమైన

రివర్‌ ఫ్రంట్‌ పర్యాటకం

గౌతమి గుట్టుక్కుమనేనా!1
1/3

గౌతమి గుట్టుక్కుమనేనా!

గౌతమి గుట్టుక్కుమనేనా!2
2/3

గౌతమి గుట్టుక్కుమనేనా!

గౌతమి గుట్టుక్కుమనేనా!3
3/3

గౌతమి గుట్టుక్కుమనేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement