నేడే ఆ శుభ గడియ!
● అంతర్వేదిలో ఈరోజు లక్ష్మీ నరసింహుని కల్యాణం
● గురువారం తెల్లవారు జామున సముద్ర స్నానాలు
● మధ్యాహ్నం నుంచి రథోత్సవం
● ఉమ్మడి తూర్పు... పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు
● రాకపోకలకు వన్ వే
● పలుచోట్ల సీసీ కెమెరాలు..
డ్రోన్లతో భద్రత పర్యవేక్షణ
సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: ఇల వైకుంఠంలో జరిగే లక్ష్మీ నరసింహుని కల్యాణానికి అంతర్వేది పుణ్యక్షేత్రం సిద్ధమవుతోంది. వేలాది మంది భక్తుల సమక్షంలో కల్యాణం నేత్ర పర్వంగా సాగనుంది. బుధవారం దశమి రాత్రి 1–56 గంటలకు (తెల్లవారితే గురువారం) రోహిణీ నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో శ్రీదేవీ, భూదేవీ అమ్మవార్లతో శ్రీ స్వామివారి కల్యాణాన్ని అర్చకులు, పండితులు నిర్వహించనున్నారు. ఆ తరువాత భక్తులు సముద్రతీరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 2.05 గంటల నుంచి స్వామి వారి రథోత్సవం జరగనుంది. లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశముండడంతో వారికి మెరుగైన సౌకర్యాలు... భద్రత కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
పిలిస్తే పలికే దైవం
భక్తుల మొర ఆలకించే కరుణామూర్తి.. ఆర్తితో, ఆవేదనతో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం లక్ష్మీనృసింహుడు. స్వామివారిని వేడుకుంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. గత ఏడాది మోంథా తుపాను ఇక్కడ తీరం దాటినా పెద్దగా నష్టం లేకుండా కాపాడింది అంతర్వేది స్వామివారేనని భక్తులు నమ్ముతారు.
ఆలయం దేదీప్యమానం
లక్ష్మీ నర్శింహుని కల్యాణం సందర్భంగా అంతర్వేది ఆలయం ముస్తాబయ్యింది. ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుదీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. కల్యాణం జరిగే ప్రాంతంలో వేదికను రంగురంగుల పూలతో అలంకరించారు. దాని చుట్టూ ఏర్పాటు చేసిన భారీ షెడ్లలో భక్తులు కూర్చుని వీక్షించేందుకు వీలుగా కంపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలు ఏర్పాటు చేస్తున్నారు.
వన్ వే
● వాహనాల రాకపోకలకు పోలీసులు వన్‌వేను అమలు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చే వాహనాలు టేకిశెట్టిపాలెం వద్ద ప్రధాన రహదారిలో కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేదికి వెళ్లాల్సి ఉంది.
● తిరుగు ప్రయాణంలో ఆలయం వెనుక వైపున ఏటిగట్టు మీదుగా గొంది, గుడిమూల, సఖినేటిపల్లి సెంటర్ మీదుగా మలికిపురం, రాజోలు, తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు.
● గుర్రాలక్క గుడికి సమీపంలోని పార్కింగ్ స్థలాల నుంచి వాహనాలు గుర్రాలక్క గుడి మీదుగా ఉన్న దండుపుంత మార్గంలో అంతర్వేదికర వద్ద మలుపు తిరిగి, గంగయ్య వారఽధి మీదుగా సఖినేటిపల్లి మూడుతూముల సెంటర్ వద్ద ప్రధాన రహదారిపైకి వెళ్లవచ్చు.
లక్ష్మీ నరసింహుని కల్యాణం... అందమైన దృశ్య కావ్యం
కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం సాయంత్రం నాలుగ గంటలకు పంచముఖ ఆంజనేయస్వామి వాహనంపై, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. తదనంతరం రాత్రి 10 గంటలకు ఎదరు సన్నాహంతో కల్యాణ మండపం వద్ద కల్యాణ క్రతువు ఆరంభమవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్ వరుడి తరఫున, దేవస్థానం, అర్చకస్వాములు వధువుల తరఫున ఎదురు సన్నాహంలో పాల్గొంటారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు పర్యవేక్షణలో వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చక స్వాములు కల్యాణ మండపానికి వధూవరులను తోడ్కొని వస్తారు. సుముహూర్తానికి ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరస్సుపైన, సహాయ అర్చకులు శ్రీదేవీ, భూదేవీ అమ్మవార్ల శిరస్సులపై ఉంచుతారు. పాణిగ్రహణానంతరం కన్యాదానం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పొలమూరు వాస్తవ్యులు తలంబ్రాల బియ్యంతోపాటు, మంచి ముత్యాలు, పగడాలు, పుసుపు, కుంకుమ అందజేస్తారు. వీటిలోని బంగారు మంగళ సూత్రాలు, వెండి ఉత్తర జంధ్యాలకు అర్చకులు వేదమంత్రాలతో పూజలు చేసి, అనంతరం అమ్మవార్లకు మంగళ సూత్రధారణ గావిస్తారు. ముందుగా అర్చకులు స్వామి, అమ్మవార్ల శిరస్సులపై తలంబ్రాలు వేస్తారు. తరువాత రాజా బహదూర్, పొలమూరు రాజులు తలంబ్రాలను స్వామి, అమ్మవార్ల పాదాల చెంతన ఉంచుతారు. బ్రహ్మముడి వేసి, చమ్కీ పూలదండలను సమర్పిస్తారు. మంగళ హారతులు ఇచ్చి కల్యాణమూర్తులకు అర్చకులు ఆశీర్వచనాలు పలకడంతో కల్యాణ క్రతువు ముగుస్తుంది. కల్యాణ మహోత్సవం అనంతరం గురువారం తెల్లవారు జామున 4–30 గంటల నుంచి ఆలయంలో శ్రీస్వామి, అమ్మవార్ల దర్శనం కొనసాగుతుందని ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్ ‘సాక్షి’కి తెలిపారు.
గెస్ట్‌హౌస్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్
భక్తుల భద్రతకు, అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు ఆలయం సమీపంలోని స్థానిక టూరిజం గెస్ట్ హౌస్ వద్ద, బీచ్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తీర్థంలో భక్తుల భద్రతకు ప్రత్యేకంగా 20 డ్రోన్‌లు, 100 సీసీ కెమెరాలను, వాకీటాకీలతో పోలీసు పహరా ఏర్పాటు చేశారు. వీటితోపాటు బటన్ సిస్టమ్‌తో ఏర్పాటు చేసే వ్యవస్థ ద్వారా అత్యవసర సమాచారాన్ని అధికారులకు అందించవచ్చు. అంతర్వేది లక్ష్మీనృసింహుని కల్యాణ మహోత్సవాల రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు.
భారీ భద్రత
● అంతర్వేదిలో బీచ్, సాగర సంగమం వంటి ప్రాంతాల్లో భక్తుల భద్రత కోసం 1,500 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత కల్పిస్తున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 1,400 మంది కానిస్టేబుల్స్, మరికొంత మంది హోంగార్డులు విధుల్లోకి రానున్నారు. కాగా బీచ్ వద్ద భక్తుల రక్షణకు ఫిషరీస్‌శాఖ ఆధ్వర్యంలో 4 రెస్క్యూబోట్లు, 100 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. బీచ్‌లో రక్షణకు ప్రత్యేక బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం వద్ద రథం షెడ్డుకు చేరి రాజోలు సీఐ టి.వి.నరేష్‌కుమార్ నేతృత్వంలో అవుట్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశారు.
● 500 మంది కార్మికులను పారిశుధ్యం పనులకు వినియోగిస్తున్నారు. 100 మొబైల్ టాయిలెట్స్, 20 శాశ్వత టాయిలెట్స్, 5 ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపులు, మూడు 108 వాహనాలు, 104 వాహనం ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్లు 26, పారామెడికల్ సిబ్బంది 85 మంది సేవలు అందించనున్నారు.
● ఆర్టీసీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి 40 బస్సులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 65 బస్సులు భక్తుల కోసం సిద్ధం చేస్తోంది.
● కల్యాణం రోజున సాధారణ భక్తులు స్వామి కల్యాణాన్ని వీక్షించేలా 12 ఎల్‌ఈడీ స్క్రీన్లు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
అంతర్వేది దూరం ఇలా.. (కిలోమీటర్లలో)
రాజోలు నుంచి 31
రాజమహేంద్రవరం 95
అమలాపురం 62
కాకినాడ 118
పాలకొల్లు 45
భీమవరం 64
హెల్ప్‌లైన్లు నంబర్లు ఇవే..
కమాండ్ కంట్రోల్ 08862–243500
పోలీసు డయిల్ 100
సఖినేటిపల్లి ఎస్సై 94407 96566
రాజోలు సీఐ 94407 96526
తహసీల్దారు 98499 03893
వీఆర్వో 97018 35669
ఎంపీడీవో 99593 69679
అంతర్వేది కార్యదర్శి 99512 30849
డాక్టర్ సూరజ్ 63046 36855
డాక్టర్ ఆర్.రాజా 95533 27733
స్వామి 77802 35621
దేవస్థానం సిబ్బంది
సారథి 98485 39377
పాపారావు 91774 90400
రాజోలు ఆర్టీసీ ఎంక్వయిరీ 08862–221057
రాజోలు ఎకై ్సజ్ 97047 79056
అంతర్వేదిలో నేడు
ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపైన, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపైన గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం కళ్యాణతంతు మొదలవుతుంది.


