కొత్త అలైన్‌మెంట్‌పై అభ్యంతరం
ప్రస్తుత మార్గం వెంబడే హైవే నిర్మించాలని జేసీకి వినతి
అమలాపురం రూరల్: రావులపాలెం– పేరూరు మధ్య ప్రతిపాదిత 216 ఈ జాతీయ రహదారి కొత్త అలైన్‌మెంట్‌పై రైతులు, ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త మార్గం వల్ల తమ సారవంతమైన పంట భూములు, నివాస గృహాలు, విద్యాసంస్థలను నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. జేసీ నిషాంతికి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుత మార్గం వెంబడే హైవే నిర్మించాలని, కొత్త మార్గంలో హైవే నిర్మించడం వల్ల కేవలం పంట భూములే కాకుండా, వేద పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు, దేవాలయాలు, శ్మశానాలు, ఉద్యాన వనాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితుల ప్రతినిధులు వీబీ పద్మనాభం, సూరవరపు ఫణి సుబ్రహ్మణ్యం, కుడుపూడి రమేష్, చొల్లంగి రాజేష్, రెడ్డి రామకృష్ణ, పప్పుల శ్రీనివాసరావు, దాసిరెడ్డి చినబాబు, పండ్రాళ్ల చిన్న అధ్వర్యంలో జేసీ నిషాంతికి వినతిపత్రం అందించారు.


