కోతల సర్కారు నిర్వాకం!
● జిల్లాలో రైతు సేవా కేంద్రాలకు కోత
● గత ప్రభుత్వ హయాంలో 455 ఆర్‌బీకేలు
● ఇప్పుడు 352 మాత్రమే
● రేషనలైజేషన్ పేరిట చంద్రబాబు సర్కార్ ఆటలు
● సిబ్బందికి సైతం బదిలీలు
● 19 మంది ఏఏఓ, ఏహెచ్‌ఓలకు
స్థాన చలనం
సాక్షి, అమలాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకాలకు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టిన పేర్లు మార్పు చేయడం... తరువాత ఆ పథకాలకు కోత పెట్టడం చంద్రబాబు ప్రభుత్వంలో సర్వ సాధారణంగా మారింది. రైతు భరోసా.. అమ్మఒడి వంటి పథకాల పేర్లు మార్చడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పెట్టారు. గత ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను చంద్రబాబు సర్కారు చిన్నాభిన్నం చేస్తోంది. గత ప్రభుత్వంలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)లు ప్రస్తుతం (రైతు సేవా కేంద్రా(ఆర్‌ఎస్‌కే)లుగా మార్చేసింది. తాజాగా రేషనలైజేషన్ పేరుతో వాటి ద్వారా అందే సేవలకు ప్రభుత్వం కోతలు పెడుతోంది.
అన్నదాతలకు వెన్నుదన్నుగా ఆర్‌బీకేలు
విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు, ఎరువుల నుంచి పురుగు మందుల వరకు, ఈ – క్రాప్ నమోదు నుంచి ఉచిత పంటల బీమా వరకు సేవలు అందిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందుబాటులో అందేవి. గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య శాఖ సహాయకులను నియమించారు. ప్రధానంగా ఈ–క్రాప్ నమోదు శరవేగంగా సాగేది. ఈ విధానం వల్లే రైతులకు ఉచిత పంటల బీమా వంద శాతం అమలు జరిగేది. పంట నష్టపోతే మూడు నెలలలోపే పెట్టుబడి రాయితీ (ఇన్‌ఫుట్ సబ్సిడీ) అప్పటి ప్రభుత్వం అందించేది. గత ప్రభుత్వం సచివాలయం యూనిట్‌గా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతులకు మెరుగైన సమాచారం అందించింది. నాణ్యమైన దిగుబడి కోసం ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచింది. ఈ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు వీటిని అధ్యయనం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అందుబాటులో ఉండడంతో రైతులు సమీపంలోని పెద్ద గ్రామాలు, పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి వచ్చేవి. వీటన్నింటికన్నా జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా నేరుగా కొనుగోలు చేసేవారు. దీనివల్ల మద్దతు ధరకు ఢోకా ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా రైతుల కళ్లాల వద్దకు వచ్చి ధాన్యం సేకరించేవారంటే అందుకు ఆర్‌బీకే కారణం.
103 ఆర్‌ఎస్‌కేలకు మంగళం
వైఎస్సార్ సీపీ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను ఇప్పటికే భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్‌బీకేల పేరు రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే)గా పేరు మార్చడమే కాక దీనిని నిర్వీర్యం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యూనిట్‌గా కొన్ని ప్రాంతాల్లో ఒక ఆర్‌ఎస్‌కే పరిధిలో సుమారు రెండు వేల హెక్టార్ల వరకు ఉన్నాయని, మరి కొన్నిచోట్ల చాలా తక్కువ విస్తీర్ణం ఉందని సాకుగా చెబుతోంది. రేషనలైజేషన్ పేరుతో ఆర్‌ఎస్‌కేలను భారీగా కుదించి వేస్తోంది. గత ప్రభుత్వం కోనసీమ జిల్లాలో మొత్తం 455 ఆర్‌బీకేలు ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ సంఖ్య 352కు కుదించింది. తద్వారా జిల్లాలో 103 ఆర్‌ఎస్‌కేలకు మంగళం పాడుతోంది. సచివాలయ వ్యవస్థను క్లస్టర్ చేయగా ఇప్పుడు ఆర్‌ఎస్‌కేలను ఆ క్లస్టర్‌కు అనుగుణంగా ఎంపిక చేస్తోంది. దీంతోపాటు సిబ్బంది కూడా తగ్గిపోతున్నారు. జిల్లాలో ఏకంగా 23 మంది వీఏఏలు అదనంగా ఉన్నారని గుర్తించారు. వీరిలో నలుగురిని కోనసీమ జిల్లాలో, మిగిలిన 19 మందిని ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సర్దుబాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతోపాటు ఇప్పటికే ఆర్‌ఎస్‌కేల ద్వారా అందుతున్న పలు సేవలను క్రమంగా తగ్గిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రామీణ వ్యవసాయంలో భాగంగా మారిన ఆర్‌బీకేలను ఇప్పుడు దూరం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
తగ్గించడం దారుణం
చంద్రబాబు సర్కార్ రైతులకు వరుసగా చాలా అన్యాయం చేస్తోంది. రైతులకు పూర్తి స్థాయి సేవలు అందించే రైతు సేవా కేంద్రాలను కుదించడం దారుణం. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరిగేది. ప్రధానంగా పటిష్టమైన ధాన్యం కొనుగోలు వ్యవస్థ దీనివల్లే ఏర్పడింది. ఇప్పుడు రైతు సేవా కేంద్రాలను తగ్గించడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. – బత్తుల అప్పారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి
మాజీ సభ్యుడు, కుందూరు, కె.గంగవరం మండలం
ఆర్‌ఎస్‌కేలను కుదించవద్దు
ఆర్‌ఎస్‌కేల ద్వారా రైతుల క్షేత్రాల వద్దనే పలు రకాల సేవలందుతున్నాయి. గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు దొరుకుతున్నాయి. మా కళ్లాల వద్దకు వచ్చి మరీ ధాన్యం కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇంత మంచి వ్యవస్థను కుదించడం దారుణం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.
– పల్లి జయ, రైతు, దేవగుప్తం, అల్లవరం మండలం
కోతల సర్కారు నిర్వాకం!
కోతల సర్కారు నిర్వాకం!
కోతల సర్కారు నిర్వాకం!


