సర్పంచ్ తిరుమలవేణికి అరుదైన గౌరవం
కాజులూరు: మండలంలోని బందనపూడి సర్పంచ్ డేగల తిరుమలవేణికి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనవలసిందిగా ప్రౌడ్ టు బి యాన్ ఇండియా (పీటీబీఐ) నుంచి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొన్నేళ్లుగా పేద ప్రజలకు తానూ, తన కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న సేవలు, పేద విద్యార్థులకు అందిస్తున్న సహకారాలను పీటీబీఐ గుర్తించి ఈ అవకాశాన్ని అందజేసిందన్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను వీక్షించటంతో పాటు ప్రధానమంత్రితో సమావేశంలోనూ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జార్జి కురియన్, సురేష్‌గోపిలతో అల్పాహార విందులోనూ పాల్గొననున్నట్టు తెలిపారు.
22న మహా గాయత్రీ
పీఠాధిపతికి పట్టాభిషేకం
అమలాపురం టౌన్: శ్రీశైలం మహా గాయత్రీ పీఠాధిపతిగా ఇటీవల నియమితులైన అమలాపురానికి చెందిన కారుపర్తి తేజేశ్వరశర్మకు పట్టాభిషేకం ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.09 గంటలకు జరుగుతుందని ఆ పీఠం ప్రధాన కార్యదర్శి అంబాబత్తుల అండకొండ రాముడు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హంపి హేమకూట శ్రీ గాయత్రీ మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీ దయానందపురి మహాస్వామి చేతుల మీదుగా పట్టాభిషేకం జరుగుతుందని, ఇది దేవ బ్రహ్మణ (దేవాంగ) ద్వితీయ గురు పీఠమని వివరించారు.
అశ్వవాహనం సమర్పణ
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి కేశవదాసుపాలెంకు చెందిన దాతలు బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబ సభ్యులు సంయుక్తంగా శుక్రవారం ఇత్తడితో తయారు చేసిన కొత్త అశ్వవాహనం సమర్పించారు. ఆలయంలో వాహనశాల వద్ద పై వాహనానికి స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పెద్దింటి వేంకట శ్రీనివాస్, జీఎల్‌ఎన్ రాజేష్, వేద పండితుడు చింతా వేంకట శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. వాహనాన్ని 169 కేజీల ఇత్తడితో రూ.4 లక్షల ఖర్చుతో సమకూర్చారు. అర్చకుల సంప్రోక్షణ అనంతరం వాహనశాలకు ఆ రెండు కుటుంబాల సభ్యులు చేర్చారు. ఆలయ ఏసీ ప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు పాల్గొన్నారు.
సర్పంచ్ తిరుమలవేణికి అరుదైన గౌరవం
సర్పంచ్ తిరుమలవేణికి అరుదైన గౌరవం


