అప్రమత్తంగా విధి నిర్వహణ
● కలెక్టర్ మహేష్‌కుమార్ సూచన
● అంతర్వేది నరసన్న
కల్యాణోత్సవాలపై సమీక్ష
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సూచించారు. శుక్రవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో డివిజన్ స్థాయి శాఖల అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఆదివారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ జరుగనున్న ఈ ఉత్సవాల్లో 28న కల్యాణం, 29న రథోత్సవం, ఫిబ్రవరి 1న పౌర్ణమి స్నానాలకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ తీర్థంలో శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని డీపీవోకు సూచించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ కల్యాణ అక్షింతల పంపిణీ సమయంలో, పౌర్ణమి రోజు సముద్రం వద్ద రోప్ పార్టీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్సవాలకు గతంలో మాదిరిగా మలికిపురంలో ఆర్టీసీ బస్ స్టాప్ పాయింట్ లేదని, సరాసరి అంతర్వేదికి వెళతాయని రాజోలు డిపో అధికారి పేర్కొన్నారు. తీర్థంలో బందోబస్తుకు వివిధ స్థాయిల్లోని పోలీసు సిబ్బంది 1,350 మంది డ్యూటీలో ఉంటారని అడిషనల్ ఎస్పీ ప్రసాద్ చెప్పారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ఆర్డీవోలు కొత్త మాధవి, శ్రీకర్, అఖిల, ఎండోమెంట్స్ డీసీ డీఎల్వీ రమేష్‌బాబు, జిల్లా ఎండోమెంట్స్ అధికారి సత్యనారాయణ, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్, తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, సర్పంచ్ కొండా జాన్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు పాల్గొన్నారు.


