తీరు మారేనా!
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
● నరసన్నా..
సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వేలాదిగా భక్తులు ఈ కల్యాణ క్రతువుకు తరలి రానున్నారు. కానీ, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్వామి వారి భక్తులు, అనాదిగా కొన్ని కుటుంబాలు, కొన్ని కుల సంఘాలు చేస్తున్న సేవా కార్యక్రమాలు తప్ప.. ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు అంతంత మాత్రమే కావడం గమనార్హం.
25న ప్రారంభం
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ జరగనున్నాయి. వీటిలో ముఖ్యమైన కల్యాణోత్సవాన్ని ఈ నెల 28వ తేదీ రాత్రి నిర్వహిస్తారు. ఆ మర్నాడు రథోత్సవం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలనూ తిలకించడానికి భక్తులు భారీగా వస్తారు. మొత్తంగా కల్యాణోత్సవాలకు ఐదారు లక్షల మంది వస్తారన్నది అంచనా కాగా, వారిలో సుమారు 3 లక్షల మంది కల్యాణం, రథోత్సవానికే వస్తారని చెబుతున్నారు. తిరిగి పౌర్ణమి రోజున మరో 2 లక్షల మంది వచ్చే అవకాశముంది. చాలా మంది భక్తులు కల్యాణం రోజు సాయంత్రానికి చేరుకుని కల్యాణోత్సవాన్ని తిలకించడంతో పాటు తెల్లవారుజామున సముద్ర స్నానాలకు వెళ్తారు. అనంతరం స్వామివారి దర్శనం, మధ్యాహ్నం నుంచి రథోత్సవం చూసుకుని సాయంత్రం స్వస్థలాలకు తిరిగి వెళ్తారు. కల్యాణోత్సవం వీక్షించేందుకు వచ్చే వేలాది మంది భక్తులు ఆవిధంగా 24 గంటలకు పైగా అంతర్వేదిలోనే ఉంటారు.
పెరిగిన భక్తులు, ఆదాయం
దశాబ్ద కాలంగా అంతర్వేది ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. భక్తులు రెండు మూడు రెట్లు పెరిగారు. కల్యాణోత్సవాలతో పాటు రోజు వారీ భక్తుల సంఖ్య కూడా ఎక్కువైంది. గతంలో ఏడాదికి రూ.80 లక్షలు ఉండే సగటు ఆదాయం ఇప్పుడు రూ.2.50 కోట్ల వరకూ ఉంటోందని అంచనా. అయినప్పటికీ కల్యాణోత్సవాల ఏర్పాట్లలో పాత పంథాను అవలంబిస్తున్నారే తప్ప భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
సమీక్షలెందుకు?
కల్యాణోత్సవాల ఏర్పాట్లపై ఆలయం వద్ద స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు. భద్రత, బస్సులు, పారిశుధ్యం వంటి వాటి మీద సమీక్షలతోనే సరిపోతోంది. భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్ల మీద చర్చ లేకుండా పోతోంది.
ఈ నెల 28న అంతర్వేదిలో కల్యాణం
భారీగా తరలిరానున్న భక్తులు
వసతులు అంతంతమాత్రమే
సౌకర్యాల కల్పనపై మీనమేషాలు
సామాన్యుల అవస్థలు
తీరు మారేనా!
తీరు మారేనా!


