28న ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని ఈ నెల 28వ తేదీ బుధవారం రాత్రి 10.17 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయశాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. 28 ఉదయం లక్ష రుద్రాక్ష పూజ, రాత్రి దివ్య కల్యాణం, 30న సదస్యం, వేద స్వస్తి, 31న రథోత్సవం, ఫిబ్రవరి 1న నాకబలి, వసంతోత్సవం, త్రిశూల చక్రస్నానం, 2న స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరిలో తెప్పోత్సవం, 3న శ్రీపుష్పోత్సవం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు.
మహిళలను వేధిస్తే
కఠిన చర్యలు
అమలాపురం రూరల్: మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు విధించడంతో పాటు, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సేవల్లో పారదర్శకత పెంచాలన్నారు. మహిళల భద్రత కోసం బహిరంగ ప్రాంతాల లో సీసీ కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్, షీటీమ్‌ల కార్యకలాపాల బలోపేతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్లు వి.నిర్మల్ కుమార్, రవివర్మ, రాజు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి
ఆర్డర్ కాపీ అందజేత
అమలాపురం రూరల్: సౌదీ అరేబియాలోని ఫ్యాక్టరీలో పనిచేస్తూ మృతి చెందిన ఓ వ్యక్తికి ఆ కంపెనీ మరణ పరిహారం, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన సొమ్ములు అందించింది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని గురువారం కుటుంబ సభ్యులకు కలెక్టర్ అందజేశారు. వివరాల్లోకి వెళితే.. సఖినేటిపల్లికి చెందిన గొల్లమందల శామ్యూల్ 29 ఏళ్ల క్రితం సౌత్ అరేబియాకు వెళ్లాడు. ఆ దేశంలోని రియాద్‌లో బిన్ సాల్మన్ అనే ఫ్యాక్టరీలో పనిచేస్తూ 2025 జనవరి 9న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చికిత్స పొందుతూ హాస్పటల్లో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని మార్చి 28న భారత రాయబార కార్యాలయం ద్వారా బంధువులకు అప్పగించారు. శామ్యూల్ పనిచేసిన కంపెనీ వారు చట్టపర మరణ పరిహారం, రావాల్సిన బకాయి ముగింపు ప్రయోజనాలకు సంబంధించిన రూ.13,98,568ను భారత రాయబార కార్యాలయ విదేశీ వ్యవహారాల రెవెన్యూ చట్ట ప్రకారం సక్రమంగా ఏప్రిల్ 28న జమ చేశారు. సఖినేటిపల్లి తహసీల్దార్ ధ్రువీకరణ తర్వాత అతడి భార్య మార్తమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెలకు కలెక్టర్ ఆర్డర్ కాపీ అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు, కేసీఎం సమన్వయ అధికారి గోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దేవస్థానాల్లో కొత్త హుండీలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో భక్తుల క్యూలలో స్టెయిన్‌లెస్ స్టీలు హుండీలు ఏర్పాటు చేయాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం ఆదేశించారు. ప్రస్తుతం ఆలయాల్లో ఉన్న హుండీల ఎత్తు ఎక్కువగా ఉన్నందున వాటిలో కానుకలు సమర్పించడానికి భక్తు లు ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనివలన క్యూలో భక్తులు వేగంగా కదలక దర్శనం ఆలశ్యమవుతోందన్నారు. అందువలన దేవస్థానాల్లో చక్రాలతో కలిపి మూడడుగుల ఎత్తు, 16 అంగుళాల వెడల్పు, అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి అవసరమైనంత పొడవుతో స్టెయిన్‌లెస్ స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో హుండీ బరువు 55 నుంచి 60 కేజీల మధ్య ఉండాలన్నారు.
28న ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణం


