‘నీ కోశాగారం ధర్మమార్గంలో నిండుతోందా?’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘నీ కోశాగారం ధర్మమార్గంలో నిండుతోందా అని ధృతరాష్ట్రుడు తనను చూడటానికి వచ్చిన ధర్మరాజును ప్రశ్నించార’ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో గురువారం ఆయన వ్యాస భారతంలోని ఆశ్రమవాసిక పర్వంలోని ప్రధాన సన్నివేశాలను వివరించారు. వనవాస దీక్షలో ఉన్న గాంధారీ ధృతరాష్ట్రులను, తల్లి కుంతీదేవిని యుధిష్ఠిరుడు తమ్ములతో, ధర్మపత్నితో, ఇతర పరివారంతో తరలివెళ్లి కలుస్తాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు సంధించిన ప్రశ్నలు అయోధ్యకాండలో రామచంద్రమూర్తి తనను కలసిన భరతుని అడిగిన ప్రశ్నలను పోలి ఉంటాయని సామవేదం అన్నారు. ‘నీ పాలనలో సీ్త్ర బాల వృద్ధులు దుఃఖించడం లేదు కదా?, వారు జీవిక కోసం యాచక వృత్తిలోకి దిగలేదు కదా?, నీవు శ్రద్ధతో పితరులను, దేవతలను ఆరాధిస్తున్నావా?, నీ శత్రువులు కూడా నీ ప్రవర్తనతో తృప్తిపడుతున్నారు కదా?’ నీ రాజవంశం పూర్వప్రతిష్ఠను కాపాడుకుంటున్నదా?’ అని ధృతరాష్ట్రుడు ప్రశ్నలు సంధించాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునితో నీ ఆటంకాలు లేకుండా తపోదీక్ష సాగుతోందా అని ప్రశ్నించాడు. రాముడు శబరిని కలిసినప్పుడు ఇదే ప్రశ్నను అడిగాడని సామవేదం గుర్తు చేశారు. కఠినమైన తపోదీక్షలో ఉన్న విదురుడు అడవులలో తిరుగుతుండగా, ధర్మరాజు అతడిని కలుసుకున్నాడు. యోగమార్గంలో విదురుని ప్రాణాలు ధర్మరాజులో కలసిపోయాయి. అందరూ సమావేశమయ్యారని తెలుసుకున్న వ్యాసుడు వారి వద్దకు వచ్చి ధృతరాష్ట్రునితో నీ తపస్సు వృద్ధి చెందుతోందా అని ప్రశ్నించాడు. తపస్సు పండించేవి మూడు గుణాలని, అవి ఎవరి పట్ల శత్రుభావం లేకపోవడం, సత్యం, క్రోధరాహిత్యమని సామవేదం అన్నారు. కుంతి వ్యాసునితో కర్ణుని జన్మవృత్తాంతం చెప్పి, తాను చేసినది దోషమా అని అడుగుతుంది. వ్యాసుడు కుంతిలోని అపరాధ భావాన్ని దూరం చేస్తూ, కొన్ని దేవగణాల సంకల్పంతో, మాటలతో, దృష్టితో, స్పర్శతో, సమాగమంతో సంతానాన్ని ప్రసాదించగలరని, దేవధర్మం కారణంగా మానవధర్మం దూషితం కాదనీ చెబుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన వీరులందరినీ నాటి రాత్రి గంగాతీరంలో చూపించాడని సామవేదం అన్నారు. వసంత పంచమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రవచనానికి ముందు చిన్నారులకు కలాలు, పుస్తకాలు ప్రసాదంగా వితరణ చేయనున్నట్టు కార్యక్రమ వ్యాఖ్యాత అప్పాజీ ప్రకటించారు.


