బ్యాంకు ఉద్యోగుల నిరసన
అమలాపురం టౌన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా గురువారం చేపట్టిన ఒక్క రోజు సమ్మెలో కోనసీమలోని 45 బ్యాంక్‌ల బ్రాంచీలకు చెందిన 250 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. వారందరూ గురువారం సాయంత్రం అమలాపురానికి చేరుకుని ప్రదర్శన నిర్వహించారు. అమలాపురంలోని యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ధర్నా చేసి, అక్కడి నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకూ ప్రదర్శన చేశారు. కోనసీమ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిదండి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని ప్రధాన బీమా సంస్థలతో పాటు ఆర్‌బీఐ, ఎస్‌ఈబీఐ లాంటి ఇతర సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేస్తున్నాయన్నారు. కానీ బ్యాంకింగ్ రంగంలో మాత్రం నేటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. బ్యాంకింగ్ రంగంలో అధికారులు, ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడి, పెరుగుతున్న పని భారం, అధిక లక్ష్యాలు తదితర సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు టీవీవీ సత్యనారాయణ, కార్యదర్శి బి.శ్రీనివాసరావుతో పాటు స్టేట్ బ్యాంక్ అవార్డు స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజియన్ సెక్రటరీ వై.గణేష్, స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కె.సురేష్, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎం.సురేష్, యూనియన్ బ్యాంక్ అవార్డు స్టాఫ్ అసోసియేషన్ ప్రతినిధి వైఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


