బోధనేతర పనులతో ఉపాధ్యాయులపై ఒత్తిడి
రామచంద్రపురం రూరల్: ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్న బోధనేతర పనులు, విద్యాశక్తి కార్యక్రమాలను రద్దు చేయాలని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రామచంద్రపురం పట్టణం, రూరల్‌లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను కలసి విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు లేని కారణంగా డీఏ బకాయిలు మున్సిపల్ కమిషనర్ అకౌంట్లో ఉండిపోతున్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలని, లేని పక్షంలో ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన, ఆర్థిక కార్యదర్శులు పోతంశెట్టి దొరబాబు, కారుపల్లి కళ్యాణ బాబు, కుడుపూడి హేమంత శివకుమార్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి శివప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు పేరిచర్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


