తప్పు చేయలేదని ప్రమాణం చేస్తారా?
● ఎమ్మెల్యే ఆనందరావుకు
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సవాల్
● అఖిల పక్షం ఏర్పాటు చేయాలని
డిమాండ్
అమలాపురం టౌన్: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఏ తప్పూ చేయకపోతే, ఎక్కడా అవినీతికి పాల్పడకపోతే, ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోకపోతే ఆయన నమ్మిన దేవుని ముందు ప్రమాణం చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలను, తాను చేసిన ఆరోపణలను ఆయన ప్రమాణం ద్వారా నివృత్తి చేసుకోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు అమలాపురంలో గురువారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ సవాల్‌ను ఎమ్మెల్యే స్వీకరిస్తే తాను కూడా తాను నమ్మిన దేవుని ముందు ప్రమాణం చేస్తానన్నారు. ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహల ఆధారంగా తాను మాట్లాడానని చెప్పారు. ఆయన గత రెండేళ్లలో ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేసినప్పుడు, తాను కూడా బహిరంగంగా వచ్చి ప్రమాణం చేస్తానన్నారు. ఎమ్మెల్యే అవినీతిని నిగ్గు తేల్చేందుకు అఖిల పక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షం విచారణలో ఎమ్మెల్యే సచ్చీలుడని తేలితే తాను బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన స్థాయి గురించి మాట్లాడుతున్న కూటమి నేతలు గతంలో తన సొంత గ్రామం ఎస్.యానాంలో ఎమ్మెల్యే స్థాయి ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తాను గతంలో ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేసిన సంగతి వాస్తవమేనని, అదే ఎమ్మెల్యే గతంలో తన సాంతూరులో సైకిల్ స్టాండ్ కాంట్రాక్టర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.


