క్రమబద్ధకం | - | Sakshi
Sakshi News home page

క్రమబద్ధకం

Jan 22 2026 7:20 AM | Updated on Jan 22 2026 7:20 AM

క్రమబ

క్రమబద్ధకం

సాక్షి, అమలాపురం: లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు గడువు దగ్గర పడింది. జిల్లాలోని పట్టణ, గ్రామాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంపై ప్రజలకు పెద్దగా అవగాహన లేకుండా పోయింది. జిల్లా యంత్రాంగం ప్రచారం కూడా కల్పించలేదు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారికి, ఇళ్లు నిర్మించుకున్నవారు కోల్పోతున్నారు.

రెండు రోజులే..

రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు ముగింపు గడువును పెంచినా జిల్లాలో అనుకున్న స్థాయిలో క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందలేదు. కోనసీమ జిల్లా మూడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిలో ఉంది. అత్యధికంగా అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అముడా)లో ఉంది. కోనసీమ జిల్లాలోని 14 మండలాల్లో 231 గ్రామాలు అముడా పరిధిలో ఉన్నాయి.

గుర్తించిన వాటికన్నా ఎక్కువే..

కొత్తపేట నియోకవర్గం పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం మండలం, కె.గంగవరం మండలాలు కాకినాడ అర్బన్‌ డవలప్‌మెంట్‌ అఽథారిటీ, రాజమహేంద్రవరం అర్బన్‌ డవలప్‌మెంట్‌ (రుడా) పరిధిలోకి వస్తాయి. వీటిలో అనధికార లేఅవుట్లు సుమారు 220 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా వాటి సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని అంచనా. ఒక్క అముడా పరిధిలోనే అధికారులు 150 వరకు అనధికార లేఅవుట్లను గుర్తించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌తో క్రమబద్ధీకరణ

కోనసీమ జిల్లాలోని అముడా, రుడా పరిధిలోని అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అంగీకరించింది. 2025 జూన్‌ 30వ తేదీ కన్నా ముందు వేసిన అనధికార లేఅవుట్లలో ప్లాట్లు, పట్టణాలలో అనధికారికంగా నిర్మించిన ఇళ్లు, ఇతర భవాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఇందుకు తొలుత గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీ గడువు విధించగా, తరువాత అక్టోబరు 25వ తేదీ వరకు పెంచింది. తాజాగా ఈనెల 23వ తేదీ తుది గడువుగా తేల్చింది.

భూమి విలువలో..

క్రమబద్ధీకరణకు భూమి విలువలో 14 శాతం చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే తొలుత విధించిన గడువులో దరఖాస్తు చేసుకున్నవారికి దీనిలో 50 శాతం రాయితీ కల్పించింది. అంటే కేవలం ఏడు శాతం, అలాగే అపరాధ రుసుములో పది శాతం రాయితీ కల్పించారు. ఆ తరువాత నుంచి నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకుంటే భూమి విలువలో 14 శాతం క్రమబద్ధీకరణకు, ఆపై అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంది. అపరాధ రుసుము 30 శాతం వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

నత్తను తలపిస్తూ..

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును మూడుసార్లు పొడిగించినా ప్రభుత్వం ఆశించిన ఫలితం దక్కడం లేదు. జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు కొత్తపేట, రావులపాలెం, తాటిపాక, రాజోలు, మలికిపురం, అంబాజీపేట, మురమళ్ల, ముక్తేశ్వరం, కాట్రేనికోన, అల్లవరం, మామిడికుదురు వంటి మేజర్‌ పంచాయతీలు, మైనర్‌ పంచాయతీల్లో కూడా ప్రధాన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లను ఆనుకుని పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. రెవెన్యూ శాఖకు రూ.లక్షలు చెల్లించి కేవలం నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ పేరుతో అనుమతి తీసుకుని, టౌన్‌ ప్లానింగ్‌ అనుమతి లేకుండా ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ లేఅవుట్లలోనే డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్‌ సర్వీసు లైన్లు వేయడం గమనార్హం. కొన్నిచోట్ల ఇలా వేసిన అనధికార లే అవుట్లలో భవనాల నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి.

ఆదాయానికి గండి

అముడా, రుడాతో సంబంధం లేకుండా అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలలో 300 గజాల లోపు ఉన్న స్థలాలకు మున్సిపాలిటీలు అనుమతి ఇచ్చే అవకాశముంది. అమలాపురం మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 221 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రామచంద్రపురం మున్సిపాలిటీకి 192 దరఖాస్తులు, ముమ్మిడివరం నగర పంచాయతీలో 79 అనధికార లే అవుట్లు ఉండగా, 129 దరఖాస్తులు మాత్రమే అందాయి. మొత్తం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేస్తే ప్రభుత్వానికి ఎంత లేదన్నా రూ.20 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. అయితే దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, జిల్లా యంత్రాంగం పెద్దగా ప్రచారం చేయకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ నత్తనడకన సాగుతోంది.

ఫ అనధికార లేఅవుట్ల

క్రమబద్ధీకరణకు స్పందన కరవు

ఫ ఈ నెల 23తో ముగుస్తున్న గడువు

ఫ ప్రచారం చేయని యంత్రాంగం

ఫ ప్రజలకు అవగాహన లేమి

ఫ ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు

ఫ ప్రభుత్వ ఆదాయానికి గండి

అనధికార లేఅవుట్లు

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా జిల్లాలో ఈ పథకం నత్తనడకన సాగుతోంది. ఒక్క అముడా పరిధిలోనే సుమారు 150 వరకు అనధికార లేఅవుట్లను అధికారులు గుర్తించారు. ఒక్కొక్క లేఅవుట్‌లో కనీసం పది నుంచి 80 ప్లాట్లు ఉంటున్నాయి. ఇవి కాకుండా ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న మెట్ట, మాగాణీ భూముల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కానీ ఇంత వరకు 125 లేఅవుట్లలో వ్యక్తిగతంగా 675 మాత్రమే క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందాయి. ఇప్పుడున్న మొత్తం అనధికార లే అవుట్లలో ఇది పావుశాతం కూడా ఉండదని అధికారులే చెబుతున్నారు.

క్రమబద్ధకం 1
1/1

క్రమబద్ధకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement