రిపబ్లిక్ డే వేడుకలకు ముక్కామల బృందం
అంబాజీపేట: ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని ముక్కామల గ్రామానికి పసుపులేటి నాగబాబు బృందం మరోసారి దక్కించుకుంది. నాదస్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్లతో కూడిన 20 మంది సభ్యుల బృందం పసుపులేటి కుమార్ సారథ్యంలో ఈ నెల 18వ తేదీన ఢిల్లీ చేరుకుని రిహార్సల్స్‌లో పాల్గొంటోందని ముక్కామల కంచి కామకోటి నాదస్వర పాఠశాల నిర్వాహకులు నాగబాబు బుధవారం తెలిపారు. వరసగా మూడేళ్ల నుంచి నాగబాబు బృందం అరుదైన అవకాశం దక్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. ఇప్పుడు నాలుగోసారి మరో అవకాశం లభించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 220 మంది కళాకారులతో నిర్వహించే హెరాల్డింగ్ ప్రోగ్రామ్‌లో ఏపీ నుంచి ముక్కామలకు చెందిన కళాకారులకు మాత్రమే ఈ అవకా శం దక్కడం విశేషం. భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ, సంగీత నాటకఅ కాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.
మహిళ కడుపులో
4.5 కిలోల కణితి తొలగింపు
అమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు బుధవారం ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులోని 4.5 కిలోల కణితిని తొలగించారు. అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇన్ని కిలోల కణితి తొలగించడం ఇదే తొలిసారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన 50 ఏళ్ల కడలి సత్యవతి కొద్ది రోజుల కిందట కడుపు నొప్పితో బాధ పడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరిభాషలో ఆమె ఓవరియన్ సిస్టిక్టమీతో బాధతో పడుతోంది. ఆస్పత్రి వైద్యులు ఆమెకు ఓవరియన్ సిస్టిక్టమీ శస్త్ర చికిత్స చేసి కణితి తొలగించారు. బి.వీరభద్రుడు, జె.మౌనిక, మధుకర్, వై.సుధీర్ కుమార్‌తో కూడిన వైద్య బృందం, వైద్య సిబ్బంది విజయవంతంగా ఈ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ వీరభద్రుడు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావు, ఆర్‌ఎంవో డాక్టర్ కె.అనూష అభినందించారు.
కవి బాలార్జునకు
‘అక్షర ప్రవీణ’ పురస్కారం
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన కవి, రచయిత సత్యనారాయణ బాలార్జున మాకేకు అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం లభించింది. శ్రీశ్రీ కళావేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ కొండా నరసింహారావు చేతుల మీదుగా ప్రదానం చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇళ్లు, పొలాలు
కోల్పోతున్నామని వినతి
అమలాపురం రూరల్: జాతీయ రహదారి 216 ఈ అలైన్‌మెంట్‌ను మార్పు చేయాలని కోరు తూ ఇందుపల్లి, నడిపూడి, పేరూరు, బండారు లంక గ్రామస్తులు బుధవారం కలెక్టరేట్‌లో వినతి పత్రాలు అందజేశారు. దీని నిర్మాణం కారణంగా ఇందుపల్లిలో చాలా ఇళ్లు, పొలాలను కోల్పోతున్నామని వాపోయారు. ఈ మేరకు డీఆర్‌ఓ కె.మాధవికి వినతి అందించారు. అలాగే జాయింట్ కలెక్టర్‌కు కూడా వినతి పత్రం ఇవ్వడంతో పాటు వ్యక్తిగతంగా అభ్యంతరాలు తెలుపుతూ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. 2021లో ఇచ్చిన ఎలైన్‌మెంట్ ప్రకారమే హైవే నిర్మాణం జరగాలని కోరారు.
రిపబ్లిక్ డే వేడుకలకు ముక్కామల బృందం
రిపబ్లిక్ డే వేడుకలకు ముక్కామల బృందం


