అష్టమి తిథినే భీష్ముడి నిర్యాణం | - | Sakshi
Sakshi News home page

అష్టమి తిథినే భీష్ముడి నిర్యాణం

Jan 22 2026 7:20 AM | Updated on Jan 22 2026 7:20 AM

అష్టమి తిథినే భీష్ముడి నిర్యాణం

అష్టమి తిథినే భీష్ముడి నిర్యాణం

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): మాఘశుద్ధ ఏకాదశి తిథిన భీష్ముడు నిర్యాణం చెందలేదు, ఆయన నిర్యాణం చెందినది అష్టమి తిథినాడేనని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం ఆయన వేదవ్యాస ప్రవచనం కొనసాగిస్తూ, లోకంలో ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్యాణం చెందిన తొలి ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం భావించడంలో తప్పులేదని ఆయన అన్నారు. భారత, భాగవతాల్లో కొన్ని స్వల్పవైరుద్ధ్యాలు ఉన్నాయి, వీటిని అనుసరించి కొందరు భాగవతాన్ని వ్యాసుడు రాయలేదనడం తొందరపాటు నిర్ణయం కాగలదు. భారత భాగవతాలను రెంటినీ అందించినవాడే వ్యాసుడని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాగర్భస్థ శిశువును కృష్ణుడు రక్షించాడని భాగవతం చెబుతోంది, భారతం పుట్టిన మృతశిశువును కృష్ణుడు కాపాడాడని చెబుతోంది. ఇక్కడ మనం సమన్వయం చేసుకోవడం అవసరం. గర్భస్థ శిశువును కాపాడకపోతే, శిశువు బయటకు వచ్చి ఉండేవాడు కాదని సామవేదం అన్నారు. తాను రాజమహేంద్రవరంలో ముందు వ్యాసభాగవతాన్ని, తరువాత వాల్మీకి రామాయణాన్ని, ప్రస్తుతం వ్యాసభారతాన్ని ప్రవచనం చేయడం దైవప్రేరణ వలనేనన్నారు. ధృతరాష్ట్రుడు వనవాస దీక్షకు బయలు దేరినప్పుడు, వ్యాసుని అనుమతితో ధర్మరాజు అంగీకరిస్తాడు. మరణించిన భీష్మద్రోణ కర్ణాదులకు, పుత్రులకు ఇతర వీరులకు శ్రాద్ధాది కర్మలు చేయడానికి ధనం కావాలని ధృతరాష్ట్రుడు విదురుని ద్వారా ధర్మరాజుకు సందేశం పంపుతాడు. నా ధనమంతా ఆయనదే, యథేచ్ఛగా వినియోగించుకోవచ్చునని ధర్మరాజు, అర్జునుడు ప్రత్యుత్తరం పంపుతాడు. ‘మనం గతంలో ఎవరి ముందు ఐదు ఊళ్లయినా ఇమ్మని యాచన చేసేమో, వారే నేడు మన ముందు యాచన చేస్తున్నారు. సమస్త భూమండలాన్ని ఏలిన వారు వనవాసానికి వెడుతున్నారు. కాలం బలీయమైనదని అర్జునుడు వ్యాఖ్యానిస్తాడు. అర్జునుని సాంత్వన వచనాలతో భీముడు వారితో ఏకీభవిస్తాడు. గాంధారీ ధృతరాష్ట్రులతో కుంతి, విదురుడు, సంజయుడు కూడా వనవాసానికి బయలుదేరారు. అడవులకు వెళుతున్న వారిని చూసి భీముడు కూడా కన్నీరు పెట్టుకున్నాడని సామవేదం అన్నారు. ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చేయి వేయగా, గాంధారి కుంతి భుజం మీద చేయి వేసి అడవులకు బయలు దేరారు. ద్రౌపది, శిశువుతో ఉత్తర, మరి కొందరు వారితో పాటు కొంతదూరం వెళ్లారని సామవేదం అన్నారు. ద్యూతంలో ఓడిపోయిన పాండవులు వనవాసానికి వెళుతుంటే ప్రజలు ఎంతటి దుఃఖం అనుభవించారో.. ధృతరాష్ట్రాదులు వెడుతుంటే అంతటి దుఃఖాన్ని అనుభవించినట్టు వ్యాసుడు పేర్కొన్నాడని సామవేదం అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్‌ టీవీ నారాయణరావు శుభారంభం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement