అంతర్వేది నరసింహస్వామికి ఎస్పీ పూజలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని బుధవారం ఎస్పీ రాహుల్ మీనా సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా ఆయనకు ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎస్పీకి స్వామివారి చిత్రపటాన్ని ఆలయ సూపరింటెండెంట్ పి.విజయ సారథి అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబురాజు పాల్గొన్నారు.
ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న స్వామివారి కల్యాణ ఏర్పాట్లను ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. దేవస్థానం ఆధ్వర్యంలో లోపల, వెలుపల ఏర్పాటు చేస్తున్న క్యూలను పరిశీలించారు. కల్యాణ వేదిక వద్ద వీఐపీలు, సాధారణ భక్తుల గ్యాలరీల ఏర్పాటుపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌తో సమీక్షించారు. స్వామివారి కల్యాణాన్ని సాధారణ భక్తులు సంతృప్తికరంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని డీఎస్పీకి సూచించారు. వీటితో పాటు రథయాత్ర, పౌర్ణమి స్నానాలు వద్ద చేపట్టాల్సిన బందోబస్తుపై డీఎస్పీతో చర్చించారు. ఆయన వెంట రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్, ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు ఉన్నారు.


