కొత్త పాటకు తాళం!
ఇది చాలా అన్యాయం
జాతీయ రహదారి పొడవు 31.60 కిమీలు కాగా, ఇందులో 25 కిమీలు కాలువను ఆనుకుని వస్తోంది. అక్కడ లేని అభ్యంతరం మా ఊరి కాలువను ఆనుకుని నిర్మించమంటే ఎందుకు?. వరదలకు, భారీ వర్షాలకు బ్యాక్ వాటర్ వస్తే ఊరు ముంపులో ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో కొత్తగా జాతీయ రహదారి ఎలా నిర్మిస్తారు? వైఎస్సార్ సీపీ హయాంలో భట్నవిల్లి వద్ద జాతీయ రహదారికి కలపాలని నిర్ణయించారు. దానిని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.
– ఆకుల నాగేశ్వరరావు, ఇందుపల్లి రైతు.
సాక్షి, అమలాపురం: జాతీయ రహదారి 216–ఈ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ వివాదాలు రేపుతోంది. రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ఈ రహదారి కోనసీమ జిల్లా అభివృద్ధికి వెన్నెముకగా మారనుంది. ఈ కారణంగానే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డును జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకువచ్చారు. అయితే నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆలైన్‌మెంట్‌ను కాదని చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త అలైన్‌మెంట్ తీసుకురావడంతో ఇళ్లు కోల్పోయినవారు.. రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది.
31.60 కిమీల మేర నిర్మాణం
అమలాపురం పేరూరు నుంచి రావులపాలెం మండలం రావులపాడు వరకు 216–ఈ హైవే విస్తరణకు అవసరమైన భూమిని గుర్తించి, దానిని సేకరించేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి 8వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేసింది. అమలాపురం పేరూరు వై.జంక్షన్ సమీపంలో 216 జాతీయ రహదారి నుంచి రావులపాలెం వద్ద 216–ఎ జాతీయ రహదారి వరకు సుమారు 31.60 కిమీల 216–ఈ జాతీయ రహదారిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి 55.971 హెక్టార్ల భూమిని సేకరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది.
గ్రీన్ ఫీల్డ్ హైవేపైనా వివాదాలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.400 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. తాజాగా అంచనాలు రూ.630 కోట్లకు పెరిగాయి. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి రావులపాడు నుంచి నడిపూడి లాకుల వరకు పెద్దగా అభ్యంతరాలు లేవు. అక్కడి నుంచి పేరూరు వరకూ చేపట్టే నిర్మాణాలకు సంబంధించి గ్రీన్‌ఫీల్డ్ హైవే అలైన్‌మెంట్ పైనే వివాదాలు నెలకొన్నాయి. భూములు కోల్పోతున్న రైతులు, భవనాల యజమానులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కలెక్టరేట్‌లో ఫిర్యాదులతోపాటు స్థానిక ఎంపీ గంటి హరీష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొత్త అలైన్‌మెంట్‌ను పరిశీలించాలని ఎంపీ చెప్పినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఏడాది కాలంగా ఈ వివాదం కొనసాగుతున్నా.. కొత్త అలైన్‌మెంట్‌కు ప్రభుత్వం, ఎన్‌హెచ్ అధికారులు మొగ్గు చూపుతూ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నా...
● గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన మార్చాలని స్థానికులు కోరుతున్నారు. నడిపూడి నుంచి ఈదరపల్లి వంతెన, ఇందుపల్లి వంతెన, వాకలగరువు వంతెన మీదుగా తోట్లపాలెం నుంచి బోడసుకుర్రు వంతెన వద్ద 216కు కలపాలని సూచిస్తున్నారు.
● ఈదరపల్లి ఎంపీడీవో కార్యాలయం పక్క నుంచి ఇందుపల్లి మీదుగా పేరూరు ఎఫ్‌సీఐ గొడౌన్ మీదుగా ఇప్పుడు అనుకున్న ప్రాంతం వరకు రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. ఈదరపల్లి వంతెన వద్ద నుంచి ఇందుపల్లి వంతెన మీదుగా పేరూరు వరకు ఇప్పుడున్న రహదారిని గతంలో జాతీయ రహదారుల సంస్థ తమ అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడున్న రహదారిలో ఆక్రమణలు తొలగించి, జాతీయ రహదారిగా విస్తరిస్తే సరిపోతుందని వారు చెబుతున్నారు.
● ఇందుపల్లి గ్రామం వరద ముంపు ప్రాంతం. 1986లో వచ్చిన వరదలకు గ్రామం ముంపుబారిన పడింది. అప్పటి నుంచి గ్రామం హెడ్‌వర్‌ుక్స పరిధిలో ఉంది. ఇక్కడ రోడ్డు నిర్మాణం క్షేమం కాదని వాదిస్తున్నారు.
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నడిపూడి లాకుల ముందు నుంచి నేరుగా భట్నవల్లి వద్ద 216లో కలపాలని నిర్ణయించారు. దీనివల్ల ఇళ్లు కోల్పోవడం తగ్గడంతోపాటు గ్రీన్ ఫీల్డ్ హై చాలా తక్కువ దూరంగా నిర్మిస్తే సరిపోతుంది. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్‌హెచ్ అధికారులు కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్లు లేవు
భూ సేకరణకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో అవసరమైన భూములకు సంబంధించి సర్వే నంబర్లు ఉన్నాయి తప్ప రైతులు, ఇళ్లు కోల్పోతున్నవారి పేర్లు పొందు పరచకపోవడం గమనార్హం. ఇందుపల్లితోపాటు పేరూరు నుంచి రావులపాడు వరకు భూములు, ఇళ్లు కోల్పోతున్నవారు ఆందోళన చెందుతున్నారు. సచివాలయాలు, పంచాయతీల్లో ఎటువంటి నోటీసులు పెట్టలేదు. కనీసం స్థానిక వీఆర్వోలను కలిస్తే తమకు తెలియడం లేదని చెబుతున్నారు. దీనిపై ఇందుపల్లికి చెందిన బాధితులు మంగళవారం సమావేశమై జిల్లా రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి తమ అభ్యంతరాలు తెలపాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని తీర్మానించారు.
ఈదరపల్లి– ముక్కామల రోడ్డులో నడిపూడి లాకులు దాటిన
తరువాత ఇక్కడ నుంచే మొదలు కానున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే
ఇందుపల్లిలో ఇళ్లు కోల్పోయే ప్రాంతం
జిల్లాలో జాతీయ రహదారి
216–ఈపై రైతులు,
స్థానికుల నుంచి అభ్యంతరాలు
అయినా లెక్క చేయని అధికారులు..
కొత్త అలైన్‌మెంట్‌కే మొగ్గు
ప్రత్యామ్నాయ మార్గం చూపినా
నిర్లక్ష్యం
భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
సర్వే నంబర్లు తప్ప
రైతుల పేర్లు లేని వైనం
బాధితుల ఆందోళన
అమలాపురం రూరల్: మండలంలోని ఇందుపల్లి గ్రామంలో 216 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్నందున, దీనిపై జాయింట్ కలెక్టర్‌కు అభ్యంతరాలు తెలపాలని బాధితుల సమావేశం నిర్ణయించింది. మంగళవారం గ్రామంలో వారు సమావేశమయ్యారు. కలెక్టర్‌ను కలసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం వెళ్తున్న హైవే వల్ల ఇళ్లు కోల్పోతున్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని కోరనున్నారు. రావులపాలెం నుంచి నడిపూడి వరకు కాలువ గట్టు వెంబడి వచ్చిన హైవే నడిపూడి నుంచి మార్పు చెందడం వెనక కొందరు వ్యక్తుల హస్తం ఉందనే అభిప్రాయాన్ని సమావేశంలో వ్యక్తపరిచారు. వరద ప్రాంతంలో హైవే నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామంలో ముంపు సమస్య అధికమవడంతో పాటు పంటలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైవే వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, చంద్రబాబు ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సర్పంచ్ చొల్లంగి అప్పాజీ, మల్లుల పోలయ్య, నాగిరెడ్డి తాతారావు, ఆకుల నాగేశ్వరరావు, విప్పర్తి ఆదినారాయణ, తాత కాశీ విశ్వనాథ్‌తోపాటు పలువురు బాధితులు పాల్గొన్నారు.
కొత్త పాటకు తాళం!
కొత్త పాటకు తాళం!
కొత్త పాటకు తాళం!
కొత్త పాటకు తాళం!


