బాలాజీ హుండీ ఆదాయం రూ.42.30 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. స్వామి వారికి హుండీల ద్వారా రూ.42,30,489 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 12 గ్రాముల బంగారం, 140 గ్రాములు వెండి లభించాయన్నారు. 71 రోజులకు స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఆర్.శ్రీనివాస్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఆలయం వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి, స్థానికులు లెక్కింపులో పాల్గొన్నారు.
నేడు జెడ్పీ బడ్జెట్ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సమావేశం కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరుగుతుందని సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. దీనిలో బడ్జెట్‌తో పాటు 13 శాఖలపై సభ్యులు సమీక్షిస్తారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సొంత వనరుల ద్వారా రూ.24 కోట్లతో అంచనా బడ్జెట్ రూపొందించామన్నారు. ప్రభుత్వ నిర్దిష్ట గ్రాంట్ల నుంచి రూ.24.31 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. వ్యయాలు అదే స్థాయిలో ఉంటాయని వివరించారు. ఇతర గ్రాంట్ల ద్వారా మరో రూ.27 కోట్లు వచ్చే అవకాశముందన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు, వివిధ శాఖల అధికారులకు, జెడ్పీటీసీ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించామని లక్ష్మణరావు చెప్పారు.
లక్ష్మీనృసింహుని హుండీల
రాబడి రూ.46,54,233
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం అధికారులు నిర్వహించిన వివిధ హుండీల లెక్కింపుల్లో రూ.46,54,233 ఆదాయం వచ్చింది. గతేడాది నవంబర్ 28వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ 53 రోజులకు పై ఆదాయం చేకూరింది. దేవదాయశాఖ అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు, ప్రజాప్రతినిధుల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కించారు. మెయిన్ హుండీల ద్వారా రూ.45,39,278, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ నుంచి రూ.18,512, అన్నదాన హుండీల ద్వారా రూ.96,443 ఆదాయం లభించినట్టు ఏసీ ప్రసాద్ తెలిపారు.
‘అక్రమార్జనతో చేసే దానాలు నిరర్థకం’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అక్రమార్జనతో చేసే దానం నిరర్థకం, దాంతో పాపాలు తొలగవని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. మంగళవారం హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతంలోని అశ్వమేధిక పర్వంలోని సన్నివేశాలను వివరించారు. ‘‘ధర్మరాజు అశ్వమేధయాగం పూర్తి చేశాడు. ఆ సమయంలో దేహంలో సగం బంగారు రంగు ఉన్న ముంగిస వచ్చింది. పెద్ద స్వరంతో యుధిష్ఠిరుడు చేసిన యాగం, పేద విప్రుడు చేసిన పేలపిండి దానంతో సరితూగదని అంటుంది. సదస్యులు ఈ వృత్తాంతాన్ని వివరించమని అడిగారు. పేద విప్రుడు కురుక్షేత్రంలో ఊంఛవృత్తి(పొలంలో పంట కోసి తీసుకువెళ్లాక గింజలు ఏరుకుని ఆహారాన్ని సిద్ధం చేసుకోవడం)తో జీవించేవాడు. ఒకసారి గింజలు సంపాదించుకుని, పేలపిండితో భోజనం ఏర్పాటు చేసుకుని పేద విప్రుడు, భార్య, కొడుకు, కోడలు నాలుగు భాగాలు చేసుకున్నారు. ఆ సమయంలో మరో విప్రుడు అతిథిగా వచ్చాడు. తమ భాగాలను అతిథికి సమర్పించారు. ధర్మదేవతగా సాక్షాత్కరించిన ఆ అతిథి నీ దానంతో నేను సంప్రీతుడినయ్యానని చెబుతాడు. ఆ రోజు అక్కడ పొర్లిన పేలపిండితో నా దేహం సగం బంగారుమయమైంది. మిగతా సగం ధర్మరాజు యాగంతో కనకమయవుతుందని ఆశపడ్డాను అని ముంగిస అంటుంద’ని సామవేదం వివరించారు.
బాలాజీ హుండీ ఆదాయం రూ.42.30 లక్షలు


