హెల్మెట్ ధారణతో ప్రాణ రక్షణ
● అమలాపురంలో భారీ ర్యాలీ
● పాల్గొన్న ఎస్పీ రాహుల్ మీనా, డీటీవో
శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు
అమలాపురం టౌన్: హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలను నడిపితే అవి మన ప్రాణాలను రక్షిస్తాయని ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అమలాపురంలో మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భారీ మోటార్ల సైకిళ్ల ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో ఎస్పీ మీనా మాట్లాడారు. మోటారు సైకిళ్ల ర్యాలీ స్థానిక జిల్లా ఆర్మ్‌డ్ కేంద్ర కార్యాలయం నుంచి మొదలై ఈదరపల్లి వంతెన, నల్ల వంతెన, ఎర్ర వంతెన, మీదుగా గడియారం స్తంభం సెంటరు వరకు సాగింది. ర్యాలీలో ఎస్పీ మీనా, జిల్లా రవాణాధికారి (డీటీఓ) డి.శ్రీనివాసరావు, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎప్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజుతో పాటు ఇతర పోలీస్ అధికారులు, వాహన చోదకులు హెల్మెట్లు ధరించి బైక్‌లు డ్రైవ్ చేశారు.
ఆదర్శవంతులకు సత్కారం
సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వారిని ఈ సందర్భంగా ఎస్పీ మీనా సత్కరించారు. ఆర్టీసీ డ్రైవర్ పి.రాంబాబు బస్సును సురక్షితంగా నడుపుతూ రోడ్డు ప్రమాదం అనేది లేకుండా తోటి డ్రైవర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లు యు.వెంకటేష్, కె.ప్రదీప్ రోజూ యూనిఫాం ధరించి ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నారన్నారు. పోలీస్ కానిస్టేబుళ్లు సీహెచ్ నాగరాజు, పి.బలరామకృష్ణ రోజూ హెల్మెట్లు ధరించడం అభినందనీయమని చెప్పారు. ఈ అయిదుగురిని ఎస్పీ సత్కరించారు. ర్యాలీ అనంతరం స్థానిక గడియారం స్తంభం సెంటరులో ఎస్పీ మీనా విద్యార్థులు, వ్యాపారులు, పోలీస్ సిబ్బందితో హెల్మెట్ల ధారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఇక నుంచి తాము రోడ్డు భద్రతా చర్యలను తప్పకుండా పాటిస్తామని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలపై వెళతామని, విధిగా హెల్మెట్‌ను ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, ఏఆర్ ఆర్‌ఐ బ్రహ్మానందం పాల్గొన్నారు.


