కోకోకు కార్పొరేటు కాక
‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్టుగా తయారైంది కోకో రైతుల పరిస్థితి. ప్రపంచంలోనే నాణ్యమైన కోకో గింజలను ఉత్పత్తి చేస్తున్నా లాభాసాటి ధర కోసం రోడ్డు ఎక్కి ఆందోళనలు చేయాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లిప్తతకు తోడు.. కార్పొరేట్ కంపెనీల మార్కెట్ మాయాజాలంతో ధరలు పొందలేక విలవిలలాడుతున్నారు.
సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి తోటల్లో కోకో సాగు దశాబ్దాల కాలంగా జరుగుతోంది. జిల్లాలో 3,800 ఎకరాల్లో కోకో సాగు జరుగుతుండగా ఏడాదికి సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. ఎకరాకు సగటున మూడు క్వింటాళ్ల కోకో ఉత్పత్తి అవుతోంది. అదే ఏలూరు జిల్లాలో అయితే ఐదు క్వింటాళ్ల నుంచి ఆరు క్వింటాళ్ల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. కొత్త పంట కావడంతోపాటు అక్కడ పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల వల్ల అధిక దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో కోకో గింజల ధర కేజీ రూ.350 వరకు ఉంది. రెండేళ్లు కోకో గింజలకు రికార్డు స్థాయి ధర వచ్చిన విషయం తెలిసిందే. 2023లో కోకో గింజల కేజీ ధర రూ.1,100 కూడా పలికింది. తరువాత ఇది తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. అయితే అంతర్జాతీయంగా కోకో గింజలకు ఇస్తున్న ధర తమకు కూడా ఇవ్వాలని స్థానిక రైతులు కొన్ని నెలలుగా ఆందోళన బాట పట్టారు.
దిగుమతి సుంకం, జీఎస్టీతో తడిసి మోపెడు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కోకో గింజల ధర రూ.530 వరకు ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో చాక్లెట్ తయారీ కంపెనీలు ఇతర దేశాల నుంచి, మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి కోకో గింజలను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశంలో కోకో గింజల అవసరాలలో కేవలం 25 శాతం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతుండగా, మిగిలిన 75 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలా వస్తున్న వాటికి భారీగా దిగుమతి సుంకాలు చెల్లించాలి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే కోకో గింజల మీద 16.5 శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. 5 శాతం జీఎస్టీ కూడా కట్టాలి. మొత్తం మీద 21.5 శాతం అవుతోంది. అంటే ఇతర దేశాల్లో కోకో గింజల ధర రూ.530 వరకు ఉండగా, దిగుమతి సుంకం, జీఎస్టీ కలిపి రూ.113.95 చెల్లించాలి. ఈ విధంగా చూస్తే ఇతర దేశాల నుంచి వస్తున్న కోకో గింజలు కంపెనీ చేరే సమయానికి కేజీ రూ.644 అవుతోంది.
రైతుల మొర ఆలకించని ప్రభుత్వం
ఇదే సమయంలో కోనసీమ జిల్లాలో రైతులు పండిస్తున్న కోకో గింజలకు చెల్లిస్తున్న ధర కేజీ రూ.350 మాత్రమే. ఇదే రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఏలూరులో కేజీ కోకో గింజలకు రూ.400 చెల్లిస్తుండగా, ఇక్కడ ఇంత కన్నా తక్కువ చెల్లించడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన కోకో గింజలను ఆఫ్రికాలోని ఘనా దేశం పండిస్తోందంటారు. అక్కడ కన్నా నాణ్యమైన గింజలు గోదావరి జిల్లా రైతులు పండిస్తున్నారు. అయినా ఇక్కడ పండే గింజలకు తక్కువ ధరను ఇస్తూ కంపెనీలు కోకో రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. దీనిపై కొన్ని నెలలుగా రైతులు దశల వారీగా ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం వీరి మొర ఆలకించడం లేదు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు దోపిడీ ఆపడం లేదు. తాజాగా కోనసీమ రైతులు కోకో గింజలకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాము పండిస్తున్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పుడున్న ధరకు కొనుగోలు చేయాలని, కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేటుగా మారి రైతులను నష్టాలు పాల్జేసే చర్యలు అడ్డుకోవాలని, స్థానికంగా కోకో పంట పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కోనసీమ గింజలకు దక్కని ధర
జిల్లాలో సుమారు 3,800 ఎకరాల్లో సాగు
సగటున 1,140 టన్నుల గింజల ఉత్పత్తి
అంతర్జాతీయ మార్కెట్లో
ప్రస్తుత ధర కేజీ రూ.530
స్థానికంగా ఇస్తున్న ధర రూ.350 మాత్రమే
కొనుగోలు చేసే కార్పొరేట్ కంపెనీల దోపిడీ
దిగుమతి చేసుకుంటున్న గింజలకు
కేజీ రూ.644 చెల్లింపు
ఆఫ్రికా దేశం ఘనా కన్నా మేలైన
గింజలు ఉత్పత్తి చేస్తున్న రైతులు
అయినా తక్కువ ధర
చెల్లించడంపై ఆగ్రహం
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధర ఇవ్వాలి
దిగుమతి సుంకాలు చెల్లించి ఇతర దేశాల నుంచి కోకో గింజలను కేజీ రూ.644 చేసి చాక్లెట్ ఫ్యాక్టరీలు కొంటున్నాయి. స్థానిక రైతుల వద్ద నుంచి సుంకాలు చెల్లించకుండానే కోకో గింజలు కొనుగోలు చేయవచ్చు. అయినా మేము రూ.644 ఇవ్వమని కోరడం లేదు. అంతర్జాతీయంగా ఉన్న ధర కేజీ రూ.530 చేసి కొనుగోలు చేయమంటున్నాం. అయినా కంపెనీలు పట్టించుకోవడం లేదు. పెరిగిన పెట్టుబడులకు తగినట్టుగా ఆదాయం రాకపోతే కోకో సాగు చేయలేం.
– ప్రకాష్, కోకో రైతు, ఇమ్మిడివరప్పాడు, అమలాపురం మండలం
కోకోకు కార్పొరేటు కాక
కోకోకు కార్పొరేటు కాక
కోకోకు కార్పొరేటు కాక


