వాడపల్లి క్షేత్రంలో కూటమి నేతల దోపిడీ
● నకిలీ టికెట్ల స్కాంపై విచారణ జరపాలి
● భక్తుల మనోభావం దెబ్బతీస్తుంటే సనాతన వాది ఏమైపోయారు?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
రావులపాలెం: వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని కూటమి నాయకులు దోపిడీకి అడ్డాగా మార్చి, నకిలీ టికెట్ల స్కాంతో నెలకు రూ.20 లక్షల పైనే దోచేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాడపల్లి ఆలయ ప్రతిష్ఠను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. ఇటీవల నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్‌ఐఆర్ వేసి మిగతా వారిని వదిలేయడంలో నాయకుల ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆన్‌లైన్ టికెట్ల జారీ పకడ్బందీగా నిర్వహించగా ఇప్పుడు అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎందుకు తప్పిస్తున్నారని అడిగారు. మొత్తం వివాదంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తింటుంటే సనాతన వాదిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని, భక్తుల పక్షాన ప్రశ్నించడానికి వైఎస్సార్ సీపీ తరఫున సిద్ధంగా ఉంటామన్నారు.
ప్రజలకు లెక్కలు చెప్పాలి
ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నాయకులు చందాలు వసూలు చేసి దోపిడీకి తెర లేపారన్నారు. ప్రభుత్వం నుంచి దండిగా నిధులు వస్తే వచ్చింది ఎంత, చందాల రూపంలో వసూలు చేసింది ఎంత, ఖర్చు చేసింది ఎంతో ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు. ప్రభుత్వ నిధులతో చేసిన కార్యక్రమంలో అధికారులు కూడా నాయకుల కొడుకుల ఫొటోలతో గంతులు వేశారన్నారు. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల్లో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రొటోకాల్ ఎక్కడ అని ప్రశ్నించారు. సంక్రాంతి పేరు చెప్పి చంద్రబాబు మద్యం సీసాపై రూ.10 పెంచితే, కొత్తపేటలో మాత్రం బీ ట్యాక్స్ పేరుతో రూ. 60 వరకూ పెంచి మద్యం విక్రయాలు చేశారన్నారు. బస్సు టికెట్ల ధరలు తగ్గించామని చెబుతూనే ప్రజల అవసరాలకు కావాల్సిన స్థాయిలో బస్సుల సంఖ్య పెంచలేదన్నారు. దీంతో ప్రైవేట్ బస్సుల దోపిడీ పెరిగిందన్నారు.
నేడు పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్క్‌షాపు
వైఎస్సార్ సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఫిబ్రవరి 15 తేదీలోగా కార్యకర్తలకు ఐడెంటీ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మంగళవారం అమలాపురం వాసర్ల గార్డెన్స్‌లో వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్టు జగ్గిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జక్కంపూడి రాజా, నాగార్జున, కారుమూరి సునీల్ పాల్గొంటారన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిదివేల మందికి కార్డులు ఇస్తామన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, పార్టీ మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, బొక్కా కరుణాకరం, సర్పంచులు కర్రి గోవిందకృష్ణారెడ్డి, సబ్బితి మోహనరావు, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా ప్రభాకరరావు, మన్యం భాను పాల్గొన్నారు.


