ప్రతిష్టాత్మకంగా నరసన్న కల్యాణ ఏర్పాట్లు
అమలాపురం రూరల్: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కల్యాణ ఉత్సవాల నిర్వహణపై మూడవ దఫా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తాగునీరు, బారికేడ్‌లు, మరుగుదొడ్లు, తాత్కాలిక షెడ్లు, క్యూ ల ఏర్పాటు, వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్టీసీ భక్తుల రాకపోకల కోసం 125 బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల రక్షణ, భద్రతకు పోలీసులు బందోబస్తు ప్రణాళిక రచించాలన్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీ నిఘా వ్యవస్థల నడుమ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఏర్పాట్లు, 6 చోట్ల వైద్య శిబిరాలు, వైద్య సదుపాయాలు, అంబులెన్సులు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. రథోత్సవం, కల్యాణోత్సవం, చక్రస్నానం, జల విహారం ఘనంగా నిర్వహించాలన్నారు. సుమారు 380 పారిశుధ్య కార్మికులతో చెత్త సేకరణ, డంపింగ్ నిర్వహణ పక్కాగా చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ , తాగునీరు సరఫరా వంటి చర్యల ద్వారా భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి సమ న్వయం వహించాలన్నారు. విపత్తు నిర్వహణకు రెండు రాష్ట్ర స్థాయి విపత్తుల స్పందన నిర్వహణ బృందాలను నియమించామన్నారు. దేవదాయ శాఖ, పోలీస్, ఆర్టీసీ, వైద్య, శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. భక్తులకు అవసరమైన సమాచారం కోసం అనౌన్స్‌మెంట్లు, హెల్ప్‌డెస్క్‌లు, రెండు కమాండ్ కంట్రోల్ రూమ్‌లు నిర్వహించాలన్నారు. 1,300 మంది పోలీసులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహోత్సవం జరగాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి, డీఆర్‌ఓ కే.మాధవి ఆర్డీఓలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


