రావులపాలెం– అమలాపురం హైవేకు గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

రావులపాలెం– అమలాపురం హైవేకు గ్రీన్‌ సిగ్నల్‌

Jan 20 2026 7:47 AM | Updated on Jan 20 2026 7:47 AM

రావులపాలెం– అమలాపురం హైవేకు గ్రీన్‌ సిగ్నల్‌

రావులపాలెం– అమలాపురం హైవేకు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, అమలాపురం: అమలాపురం – రావులపాలెం హైవే నిర్మాణం, విస్తరణకు ఒక అడుగు పడింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగిన ఈ హైవేను కోనసీమ జిల్లా పరిధిలో రెండు హైవేలకు అనుసంధానంగా నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి 55.971 హెక్టార్ల భూమిని సేకరించేందుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న 216 జాతీయ రహదారి, తూర్పు గోదావరి జిల్లా లాలాచెరువు నుంచి ఏలూరు జిల్లా గుండుగొలను వరకు ఉన్న 216–ఏ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఈ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి 216–ఈ అని పేరు పెట్టారు. అమలాపురం మండలం పేరూరు ఎత్తు రోడ్డు నుంచి రావులపాలెం మండలం రావులపాడు వరకు మొత్తం 31.60 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మిస్తుండగా, దీనిలో 6 కిలోమీటర్లు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేగా నిర్మించనున్నారు. ఇందుకోసం 55.971 హెక్టార్ల భూమిని సేకరించేందుకు నిర్ణయించి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ రోడ్డు రెండు లైన్లు, నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్టు ఎన్‌హెచ్‌ వర్గాలు చెబుతున్నాయి. గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకటన వెలువడిన తేదీ మొదలు రైతుల వద్ద నుంచి 21 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉన్నవారు వాటిని లిఖిత పూర్వకంగా, తగిన ఆధారాలతో సహా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (కాంపిటెంట్‌ అథారిటీ)కి సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌తో భూములు, ఇళ్లు కోల్పోతున్నవారు ఆందోళన చెందుతున్నారు. తమ అభ్యంతరాలను మరోసారి గట్టిగా చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement