నిద్ర మత్తులోకి జారకుండా.. | - | Sakshi
Sakshi News home page

నిద్ర మత్తులోకి జారకుండా..

Jan 20 2026 7:47 AM | Updated on Jan 20 2026 7:47 AM

నిద్ర మత్తులోకి జారకుండా..

నిద్ర మత్తులోకి జారకుండా..

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

‘స్టాప్‌, వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం అమలు

అమలాపురం టౌన్‌: జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరగకుండా జిల్లా పోలీస్‌ శాఖ ‘స్టాప్‌, వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమాన్ని ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ చేపట్టింది. జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఆదేశాల మేరకు.. జిల్లాలోని ఎదుర్లంక నుంచి అమలాపురం వరకూ.. రావులపాలెం నుంచి సిద్ధాంతం వంతెన వరకూ జాతీయ రహదారుల పైన.. రాజోలు, కొత్తపేట తదితర స్టేట్‌ హైవేల పైన పోలీసులు ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. లారీలు, భారీ వాహనాలు, వ్యాన్లు, కార్లు నడుపుతున్నప్పుడు డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు నిద్రమత్తులోకి జారుకునే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలోనే రెప్పపాటులో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఆ సమయంలో డ్రైవర్లను అప్రమత్తం చేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమయంలో వెళ్లే వాహనాలను రోడ్డు చెంతన నిలిపి, ఆ డ్రైవర్‌ ముఖాన్ని చన్నీళ్లుతో ఓసారి కడుక్కునేలా చర్యలు తీసుకున్నారు. వారికి నిద్ర మత్తు పూర్తిగా తొలగిన తర్వాతే వాహనం నడిపేందుకు అనుమతించారు. నిద్ర మత్తు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, ఎదురయ్యే ప్రాణ నష్టాలు, ఇంటి వద్ద వారి కోసం ఎదురు చూసే భార్యాపిల్లలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలపై ఆ డ్రైవర్లకు పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు రోడ్లపై ఇక నుంచి ప్రతి రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తం చేసేలా ‘స్టాప్‌, వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఎస్పీ రాహుల్‌ మీనా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement