నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

Jan 19 2026 4:35 AM | Updated on Jan 19 2026 4:35 AM

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

అమలాపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా కలెక్టరేట్‌ గోదావరిభవన్‌లో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను ఉదయం పది గంటల నుంచి ఒంటి గంటవరకు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు మూడు రెవె న్యూ డివిజనల్‌ అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

అంతర్వేదిలో కొనసాగుతున్న రద్దీ

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రంలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. సంక్రాంతి పర్వదినాల్లో అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడి ఆదివారం కావడంతో మరింత పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చిన భక్తుల సంఖ్య రెట్టింపు అయింది. దేవస్థానం ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోవింద నామసమ్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కాగా ఆలయంలో నిత్యం నిర్వహించే సుదర్శన హోమం, విశేష అభిషేకంలోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

నేటి నుంచి పశువైద్య శిబిరాలు

అమలాపురం రూరల్‌: అమలాపురం ఏరియా పశువైద్యశాల పరిధిలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ ఎల్‌. విజయరెడ్డి ఆదివారం తెలిపారు. దీనిలో భాగంగా పశువైద్యాధికారి డాక్టర్‌ పూర్ణిమ నాగలక్ష్మి ఆధ్వర్యంలో వన్నె చింతలపూడి సొసైటీ చైర్మన్‌ నడింపల్లి వెంకటరామరాజు సోమవారం ఉచిత మెగా పశువైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో ఎదకు రాని పశువులకు చికిత్స, చూడి పరీక్షలు, లేగదూడలకు నట్టల నివారణ మందులు, అవసరమైన వాటికి శస్త్ర చికిత్సలు, వ్యాధిగ్రస్థ పశువులకు నిపుణులైన పశువైద్యాధికారులు పరిశీలించి ఉచితంగా మందులు ఇస్తారన్నారు. పశువులకు టీకాలు వేస్తారని తెలిపారు.

ఘనంగా సత్యదేవుని రథసేవ

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవునికి ఆలయ ప్రాకారంలో ఆదివారం రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. రథంపై వేంచేయించి, అర్చకులు దేవులపల్లి వరప్రసాద్‌ తదితరులు పూజలు చేశారు. అనంతరం, ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement