క్షేమంగా స్వదేశానికి..
ఖతార్ నుంచి ఇంటికి రప్పించిన కేఎంసీ బృందం
అమలాపురం రూరల్: ఖతార్ దేశంలో ఒక ఇంటిలో పనిచేస్తుండగా కింద పడి కాలుకి దెబ్బతగిలి పనిచేయలేక నరకయాతన పడిన ఉప్పలగుప్తం మండలం పేరాయిచెరువు గ్రామానికి చెందిన పి.వెంకటలక్ష్మిని కేఎంసీ బృందం క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చింది. పేరాయి చెరువుకు చెందిన పి.వెంకటలక్ష్మి గత సంవత్సరం జులై నెలలో ఖతార్ దేశం వెళ్లింది. అక్కడ ఒక ఇంటిలో పనికి కుదిరింది. అక్కడ పనిచేస్తుండగా ఇటీవల కాలు జారి పడిపోయింది. కాలికి బలమైన గాయం తగలడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అక్కడ ఇంటి యజమానులు పని చేయకపోతే కుదరదు అని చెప్పి, బలవంతంగా పనిచేయిస్తున్నారని దానివల్ల తన అక్క ఇబ్బంది పడుతోందని ఆమె సోదరుడు కృష్ణమూరి కలెక్టర్ మహేష్‌కుమార్, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఆశ్రయించారు. కనీసం వాళ్లు హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లడం లేదని, అక్కను ఖతార్ నుంచి ఇండియాకు క్షేమంగా తీసుకురావాలని విన్నవించాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆమెను క్షేమంగా స్వదేశానికి తీసుకుని రప్పించాలని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందాన్ని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం అక్కడ ఏజెంట్ కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను తిరిగి రప్పించే ఏర్పాట్లు చేపట్టి స్వదేశానికి సురక్షితంగా చేర్చిందని నోడల్ అధికారి డీఆర్‌ఓ కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ శనివారం తెలిపారు.
ఎమ్మెల్సీలకూ సీఎస్‌ఆర్ నిధులు కేటాయించాలి
అమలాపురం టౌన్: సీఎస్‌ఆర్ నిధులు ఎమ్మెల్సీలకు కూడా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కె.మోషేన్‌రాజును ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ కుడుపూడికి స్వయంగా అందించేందుకు చైర్మన్ మోషేన్‌రాజు శనివారం సాయంత్రం అమలాపురం వచ్చారు. ఎమ్మెల్సీని స్థానిక హైస్కూలు సెంటరులోని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సీఎస్‌ఆర్ నిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇస్తున్నారని, ఎమ్మెల్సీలకు కూడా ఆ నిధులను ఇప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి చైర్మన్ మోషేన్‌రాజుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ విజ్ఞప్తి పట్ల చైర్మన్ సానుకూలంగా స్పందించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను చైర్మన్ మోషేన్‌రాజు ఎమ్మెల్సీ కుడుపూడికి అందజేశారు. మోషేన్‌రాజుకు వైఎస్సార్ సీపీ నాయకులు కుడుపూడి త్రినాథ్, ముంగర ప్రసాద్, సీహెచ్.రంగరాజు, ఆర్.సత్తిబాబు రాజు, సీహెచ్. సుబ్బరాజు స్వాగతం పలికారు.
విశ్వరూప్‌నకు ఆహ్వానం
అమలాపురం రూరల్: శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేన్‌రాజు అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పీఏసీ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్‌ను కలసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలను అందించారు. పట్టణ, ఉప్పులగుప్తం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని నాని, బద్రి బాబ్జి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు దూడల ఫణి మోషేన్ రాజును సత్కరించారు.
మహాలక్ష్మి ఆలయ నిర్మాణానికి
రూ.28.49 లక్షల విరాళాలు
పి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్మిర్మాణానికి భక్తులు శనివారం రూ.28.49 లక్షల మేర విరాళాలను ఆలయ కమిటీకి అందజేశారు. గ్రామానికి చెందిన చిట్టాల ఆదినారాయణమూర్తి రూ.5,67,999, చిట్టాల పాండు రంగారావు కుటుంబ సభ్యులు రూ.5,00,116, దివంగత యర్రంశెట్టి కొండలరావు కుమారులు, కుమార్తెలు, మనుమలు కలిసి రూ.4,78,116, నల్లా ఆదినారాయణమూర్తి రూ.3,00,999, అల్లాడ భాస్కరరావు రూ.3,00,006, అల్లాడ మార్తాండ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు, డొక్కా జగ్గారావు కుటుంబ సభ్యులు రూ.1,00,800, డొక్కా చిట్టియ్య కుమారులు రూ.1,00,800, యర్రంశెట్టి నవీన్‌కుమార్ రూ.1,00,116, మంత రమణారావు కుటుంబ సభ్యులు రూ.1,16,000, చిట్టాల సత్యనారాయణ మూర్తి రూ.1,00,889, చిట్టాల చిట్టిబాబు రూ.51,116 ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. పలువురు గ్రామస్తులు రూ.10 వేల వంతున విరాళాలను ఆలయ కమిటీకి అందజేశారు.
క్షేమంగా స్వదేశానికి..
క్షేమంగా స్వదేశానికి..


