హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు ప్రభ
అమలాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమం కంటే హత్యా రాజకీయాలను ఎక్కువగా ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా గురుజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త, దళిత యువకుడు మండా సాల్మన్‌ను ప్రభుత్వ ప్రోత్సాహంతో దారుణంగా హత్య చేసిన ఘటనను ఆయన ఖండించారు. ఈ మేరకు కిషోర్ అమలాపురంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. సాల్మన్ హత్య చంద్రబాబు ప్రభుత్వ రాక్షస పాలనకు అద్దం పడుతోందని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి దళితులన్నా, దళితుల ప్రాణాలన్నా చులకన భావన ఉందని ఆరోపించారు. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించేందుకు దళిత బహుజనుల సమీకరణ జరుగుతోందని కిషోర్ హెచ్చరించారు.
అప్పనపల్లి బాలాజీకి
రూ.8.16 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామికి శనివారం రికార్డు సంఖ్యలో ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.8,16,073 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 24 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 8,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.90,397 విరాళాలుగా అందించారన్నారు. మండపేటకు చెందిన మాకే ఏసుదాసు వారి కుటుంబ సభ్యులు స్వామి వారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50,049 విరాళంగా అందించారు.
విద్యుత్ చార్జీలపై 20 నుంచి
ప్రజాభిప్రాయ సేకరణ
రామచంద్రపురం: విద్యుత్ చార్జీలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ బి.రాజేశ్వరి, రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే రత్నాలరావు శనివారం ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి ఈ అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. 20న తిరుపతిలోనూ 22,23 విజయవాడ, 27న కర్నూలులో హైబ్రిడ్ విధానంలో అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు 1.00 నుంచి 2.30 గంటల వరకు ప్రత్యక్ష విధానంలో మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.


