‘సర్వలోకాలలో సీ్త్రలు రహస్యాలను ఇకపై కాపాడలేరు’ | - | Sakshi
Sakshi News home page

‘సర్వలోకాలలో సీ్త్రలు రహస్యాలను ఇకపై కాపాడలేరు’

Jan 18 2026 7:23 AM | Updated on Jan 18 2026 7:23 AM

‘సర్వలోకాలలో సీ్త్రలు రహస్యాలను ఇకపై కాపాడలేరు’

‘సర్వలోకాలలో సీ్త్రలు రహస్యాలను ఇకపై కాపాడలేరు’

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): కర్ణుని జన్మ రహస్యం గోప్యంగా తల్లి కుంతీదేవి ఉంచడం వల్ల, తాను అన్నను చంపుకుని తీవ్ర శోకానికి గురయ్యానని, ఇకపై సర్వలోకాలలో సీ్త్రలు రహస్యాలను కాపాడజాలరని ధర్మరాజు శపించాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శనివారం ఆయన హిందు సమాజంలో శాంతి పర్వంలోని పలు అంశాలను వివరించారు. రాజ్యపాలనకు విముఖత చూపిన ధర్మరాజు మహర్షుల, సోదరుల అభ్యర్థన మేరకు పట్టాభిషిక్తుడు అవుతాడు. కృష్ణపరమాత్మ పవిత్ర జలాలు నిండిన శంఖంతో ధర్మరాజును అభిషేకం చేస్తాడు. అందరూ ధృతరాష్ట్రుని ఆజ్ఞను పాటించాలని, పూర్వం ఆయన ఎటువంటి గౌరవం పొందేవాడో, అదే గౌరవం కొనసాగాలని, ఆయనే కురురాజ్యానికి నాథుడని ధర్మరాజు ప్రకటిస్తాడు. ధర్మరాజు వ్యక్తిత్వం అంతటి ఉన్నతమైనదని సామవేదం అన్నారు. భారతాన్ని మూడు భాగాలుగా చూడాలి–ఆది, సభా, వన, విరాట, ఉద్యోగ పర్వాలకు ఆదిపంచకమని పేరు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, సీ్త్ర పర్వాలకు యుద్ధషట్కమని పేరు. ఇక శాంతి, అనుశాసన, అశ్వమేఽధిక, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలకు శాంతి సప్తకమని పేరు ఉన్నదని సామవేదం అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్‌ భారతంలో కృష్ణుడు, రామాయణంలో హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని వర్ణించారని సామవేదం అన్నారు. నియమాలు అతిక్రమించిన వారే నియమాలు చెప్పడం చూస్తున్నాం, వీరికి ఉదాహరణగా దుర్యోధన, కర్ణులని పేర్కొనాలని ఆయన అన్నారు. భారతంలో 18 పర్వాలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు, భారత యుద్ధంలో పాల్గొన్నది 18 అక్షౌ హిణుల సైన్యం, యుద్ధం 18 రోజులు నడిచిందని సామవేదం వివరించారు. వేల సంవత్సరాలకు ముందే యుద్ధనీతి, రాజనీతి వేళ్లూనుకున్న దేశం ఒక్క భారతదేశమే, జీవితాన్ని సర్వతోముఖంగా తీర్చిదిద్దగల శక్తి భారతానికి ఉన్నదని ఆయన అన్నారు. యుద్ధపర్వాల పేర్లు అన్నీ కౌరవపక్ష నాయకుల పేర్లు మాత్రమే ఉండటానికి కారణాలు సామవేదం వివరించారు. పాండవ పక్షాన యుద్ధం ఆదినుంచి అంతం వరకు ధృష్టద్యుమ్నుడే సర్వసైన్యాధ్యక్షుడు, కౌరవుల పక్షాన వారు మారుతూ వచ్చారు. మానవుడికి సాధారణంగా మూడు స్థితులు తెలుసు, అవి స్వప్న, సుషుప్తి, నిద్రావస్థలు, వీటిని మించిన తురీయావస్థ గొప్ప యోగులకే సాధ్యమని అన్నారు. భీష్ముడు అస్తమిస్తే, సమస్త ధర్మాలు అస్తమిస్తాయని, శరతల్పగతుడయిన ఆయన నుంచి అన్ని ధర్మాలు తెలుసుకోవాలని కృష్ణుడు పాండవులకు చెప్పి, భీష్ముని వద్దకు తీసుకువెడతాడని, ఆ సమయంలో భీష్ముడు అచ్యుతుని చేసిన స్తోత్రం భీష్మస్తవ రాజం అత్యంత మహిమాన్వితమైనదని, స్తోత్రాలు అన్నీ వాగ్రూపమైన యజ్ఞాలని సామవేదం వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement