జూదం సంప్రదాయమై!
● జిల్లాలో బరి తెగించి పందేల నిర్వహణ
● వందకు పైగా బరులలో
రూ.వంద కోట్లు దాటిన పందేలు
● ఒక్క మురమళ్లలోనే..
40 కోట్లకు పైగా పందెం
● గుండాటలు.. పింగ్ పాంగ్ బాల్...
లక్కీ డిప్‌లు
● ఫుడ్ స్టాల్స్ మీద సైతం దోపిడీ
● చెలరేగిన అధికార పార్టీ నేతలు
సాక్షి, అమలాపురం: పచ్చనేతల అధికార బలం ముందు పోలీసు హెచ్చరికలు మూగబోయాయి. పందేలను అడ్డుకోవాలనే కోర్టు ఆదేశాలు.. చట్ట ప్రకారం శిక్షిస్తామన్న పోలీసుల ప్రకటనలకు జూదగాళ్లు వెరవకపోగా రెట్టించిన ఉత్సాహంతో బరితెగించి పందేలు నిర్వహించారు. పనిలో పనిగా రికార్డింగ్ డాన్సులు వేయించారు. పట్టణాలు.. పల్లెలన్న తేడా లేకుండా కోడి పందేలు, గుండాటలు నిర్వహించారు. మురమళ్ల, ఎస్.యానాంలో అయితే సంక్రాంతి సంబరాల మాటున అధికార పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పందేలు సాగిపోయాయి.
పందేల బరిలో కోళ్ల తలలు తెగిపడ్డాయి. నోట్ల కట్టలు పెళపెళలాడాయి. ఈ ఏడాది పట్టణాలు.. పల్లెల్లో సంక్రాంతి పండగ సందడి లేకున్నా.. బరులు, రికార్డింగ్ డ్యాన్సుల వద్దనే సందడంతా కనిపించింది. పందేల మీద నిషేధాజ్ఞలు.. నిఘా కళ్లు ‘లెక్క’ల చా టున జారుకున్నాయి. వేలు..లక్షలు కాదు.. కోట్ల రూ పాయలు చేతులు మారాయి. అధికార పార్టీకి చెందిన టీడీపీ, జనసేన నేతలు బరులు పంచుకుని మరీ పందేలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా చిన్నా, పెద్దా కలిపి వంద వరకు బరులు వేశారు. సంబరాల వేదికల వద్ద కార్లు, మోటారు సైకిళ్లకు లక్కీ డిప్‌లు ఏర్పా టు చేసి కొత్త తరహా లాటరీలు మొదలు పెట్టారు. ఇలా సర్వం జూదగాళ్ల నుంచి దోపిడీ చేశారు.
రూ.లక్షలలో పందేలు
జిల్లాలో అతి పెద్ద పందేలు ఐ.పోలవరం మండలం మురమళ్లలో జరిగాయి. పెద్ద బరిలో రోజుకు 25 పందేల చొప్పున మొత్తం మూడు రోజుల కలిపి మొత్తం 75 పందేలు నిర్వహించారు. స్థానికులే కాకుండా తెలంగాణ, చైన్నె, బెంగళూరు నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వ్యాపారులు, ఆ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు రూ.లక్షలలో పందేలు కాశారు. ఒక్కొక్క పందెం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిగింది. మూడు రోజులకు కలిపి రూ.37.50 కోట్ల మేర పందేలు జరిగినట్టు అంచనా. ఇది కాకుండా మరో రెండు చిన్న బరులలో కోడి పందేలు జరిగాయి. వీటితో పాటు గుండాట, బాల్ గుండాట, చక్రం గుండాటలు కూడా నిర్వహించగా, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పందేలు కాశారు. మొత్తం మీద అన్ని పందేలు కలిపి ఇక్కడ రూ.50 కోట్ల మేర సాగాయి. ఈ పందేలకు కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, సినీ నటి హేమ వంటి వారు వచ్చారు. పందేలకు మహిళలు పెద్దగా రావడంతో పాటు వారు కూడా ఉత్సాహంగా పందేలు కాయడం గమనార్హం.
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో కాట్రేనికోన మండలం చెయ్యేరు, ముమ్మిడివరం ప్రాంతాల్లో కూడా భారీగా పందేలు జరిగాయి. అమలాపురం నియోజకవర్గంలో మొత్తం 26 బరులు, 19 వరకూ గుండాట బోర్డులు నిర్వహించారు. మొత్తం 3 రోజుల్లో కోడి పందేల ద్వారా రూ.3.5 కోట్లు, గుండాటల బోర్డుల ద్వారా రూ.రెండు కోట్ల పందేలు జరిగినట్టు అంచనా. అల్లవరం మండలం రెల్లుగడ్డ, కోడూరుపాడుల్లో పెద్ద పందేలు జరిగాయి. కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేటలలో సుమారు 20 బరులలో కోడి పందేలు నిర్వహించగా, 53 గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.మూడు కోట్ల మేర చేతులు మారినట్టు సమాచారం. రామచంద్రపురం నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 12 బరులలో పందేలు నిర్వహించారు. సుమారు రూ.1.5 కోట్ల మేర పందేలు జరిగాయి. రాజోలు దీవిలో మలికిపురం, మామిడికుదురు మండలాల్లో పెద్ద ఎత్తున పందేలు నిర్వహించారు. ఇక్కడ పందేలతో పాటు రికార్డింగ్ డ్యాన్సులు కూడా యథేచ్చగా సాగాయి. కేశనపల్లి, తూర్పుపాలెం, గోగన్నమఠం, మగటపల్లిలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన సూచనలతో పోలీసులు మూడు రోజుల మౌనదీక్ష వహించారు.
ఐ.పోలవరం మండలం
మురమళ్లలో కోడి పందేలు
జూదం సంప్రదాయమై!
జూదం సంప్రదాయమై!
జూదం సంప్రదాయమై!
జూదం సంప్రదాయమై!
జూదం సంప్రదాయమై!


