భక్తులతో కిక్కిరిసిన నృసింహ క్షేత్రం
సఖినేటిపల్లి: సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం ఎటు చూసినా భక్తులతో రద్దీగా మారింది. ఆలయ పరిసర ప్రాంత వాసులతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలి వచ్చిన భక్తులు భారీ క్యూ లైన్లలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిత్యం నిర్వహించే సుదర్శన హోమం, విశేష అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం స్వామి, అమ్మవార్లను గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అరటిపళ్లు, కొబ్బరికాయలను భక్తులు నైవేద్యాలుగా సమర్పించుకున్నారు.
సంక్రాంతి ఉత్సవాల్లో
సిక్కిం డీజీపీ నవుండ్రు
అమలాపురం రూరల్: సిక్కిం రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్న నవుండ్రు శ్రీధరరావు ఆయన సొంత గ్రామం మండలంలోని జనుపల్లిలో నిర్వహిస్తున్న సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మడికి శ్రీరాములు ఆధ్వర్యంలో శుక్రవారం సిక్కిం రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న నవుండ్రు శ్రీధర్‌రావును జనుపల్లిలోని ఆయన నివాసగృహంలో కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. శ్రీధర్‌రావు గతంలో ఢిల్లీ డీజీపీగా పని చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, సబ్ రిజిస్ట్రార్ రాయి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
‘నేనెంతో.. నా సోదరుడూ అంతే’
సామవేదం షణ్ముఖ శర్మ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘అమ్మా! ఇతరుల నెత్తురు తాగరాదు. నేనెంతో నా సోదరుడూ అంతే. సోదరుని నెత్తురు తాగవచ్చునా? దుశ్శాసనుడి నెత్తురు నా దంతాలు, పెదవులు దాటి లోపలకు పోలేదు’ అని గాంధారితో భీముడు చెప్పినట్టు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనంలో భాగంగా స్థానిక హిందూ సమాజంలో శుక్రవారం ఆయన సీ్త్ర పర్వంలోని ప్రధాన సన్నివేశాలను వివరించారు. ‘దుశ్శాసనుడి రొమ్ము చీల్చి, నెత్తురు తాగడం హేయమైన పని అని భీముడిని గాంధారి నిందిస్తుందించగా, ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేని క్షత్రియుడు ధర్మానికి దూరమవుతాడని భీముడు ఆమెకు బదులిస్తాడని, పాండవులను శపించడానికి గాంధారి సిద్ధపడిందని తెలుసుకున్న వ్యాస మహర్షి అక్కడకు వచ్చి నీ కొడుకు యుద్ధంలో నిత్యం నీ ఆశీస్సుల కోసం వచ్చేవాడు. యతోధర్మస్తతో జయః అని నీవు దీవించేదానివి. నీ మాటే నిజమైందని చెప్పిన ఆయన మాటలకు గాంధారి శాంతించింద’ని సామవేదం వివరించారు. తరువాత ఆమె కోపం కృష్ణుని వైపు మళ్లిందని ‘నీవే తలచుకుంటే ఈ మహావిపత్తును నివారించేవాడివని, నేను పతిశుశ్రూష చేసి సంపాదించుకున్న పుణ్యంతో నిన్ను శపిస్తున్నాను. ఇక 36 ఏళ్లకు నీ దాయాదులు పరస్పర కలహాలతో మరణిస్తారు. నీవు కూడా దిక్కులేని మరణం చెందుతావని ఆమె శపిస్తుందని, దానికి కృష్ణుడు ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ముందుగా నిర్ణయమైన దానినే నీవు శాపం ద్వారా తెలియపరుస్తున్నావు. నీ తపోశక్తి వ్యర్థం చేసుకుంటున్నావ’ని కృష్ణుడు నవ్వుతూ చెప్పినట్టు షణ్ముఖశర్మ వివరించారు. అలాగే ‘నీ కొడుకు దుర్యోధనుడు దురాత్ముడు, ఈర్ష్యాళువు, తనను తాను పొగుడుకునే వాడు, క్రూరుడు, శత్రుభావం కలవాడు, పెద్దల మాటను గౌరవించే స్వభావం లేనివాడు’ అని గాంధారికి వివరించి ధర్మదృష్టి లేని తపస్సు అనర్థదాయకమని ఆయన తెలిపారు. ‘రణభూమిలో పడి ఉన్న దుర్యోధనుడిని చూసి గాంధారి తీవ్రశోకానికి లోనై దుర్యోధనుడు యుద్ధంలో మరణించలేదు. కృష్ణుని, విదురుని మాటను గౌరవించని నాడే మరణించాడని ఆమె భావించింది’ అని చెప్పారు.
భక్తులతో కిక్కిరిసిన నృసింహ క్షేత్రం
భక్తులతో కిక్కిరిసిన నృసింహ క్షేత్రం


