భక్తిశ్రద్ధలతో భోగి
ఐ.పోలవరం: జిల్లా ప్రజలు బుధవారం భోగి పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి, సంబరాలు జరుపుకొన్నారు. చిన్న పిల్లలకు భోగిపండ్లు పోశారు. ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి సంతోషంగా గడిపారు. ప్రతి ఇళ్లూ బంధుమిత్రులు, స్నేహితులతో కిటకిటలాడింది.
ప్రభల తీర్థానికి బందోబస్తు
అంబాజీపేట: మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో శుక్రవారం జరిగే ప్రభల తీర్థానికి కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో 314 మందితో భారీ బందో బస్తును ఏర్పాటు చేసినట్టు పి.గన్నవరం సీఐ వై.భీమరాజు తెలిపారు. ఎస్సై కె.చిరంజీవి పర్యవేక్షణలో మొబైల్ పార్టీలు తీర్థంలో సంచరిస్తారన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనాల దారి మళ్లింపు
కొత్తపేట: సంక్రాంతి ప్రభల ఉత్సవం సందర్భంగా గురువారం కొత్తపేట మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించినట్టు ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. ప్రభల ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో కనుమ పండగ (శుక్రవారం) రోజు జరుగుతుండగా, కొత్తపేటలో మాత్రం సంక్రాంతి (గురువారం) నాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బంది పడకుండా డీఎస్పీ సుంకర మురళీ మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యా మ్నాయ మార్గాలను నిర్దేశించామన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకూ అమలాపురం, రావులపాలెం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలను దారి మళ్లించామన్నారు. రావులపాలెం వైపు నుంచి అమలాపురం వెళ్లే వాహనాలన్నీ బోడిపాలెం వంతెన నుంచి వాడపాలెం, వానపల్లి, అయినవిల్లి ,ముక్తేశ్వరం మీదుగా అమలాపురం వెళ్లాలన్నారు. అదే విధంగా అమలాపురం నుంచి రావులపాలెం వెళ్లే వాహనాలు పలివెల వంతెన నుంచి పలివెల గ్రామం, గంటి మలుపు, ఈతకోట మీదుగా జాతీయ రహదారి ఎక్కాలని సూచించారు.
సంక్రాంతి శుభాకాంక్షలు
అమలాపురం రూరల్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకై న సంక్రాంతి పండగను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. ఆయన బుధవారం జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, రైతు లోగిళ్లలో ధాన్యం రాశులు, పిండి వంటలు, బంధుమిత్రుల సందడితో కనువిందుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సముద్రమంత సైన్యం
గోష్పాదమంతైంది
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కురు పాండవ సంగ్రామం 18వ రోజు 11 అక్షౌహిణుల సముద్రమంత కురుసైన్యం గోష్పాదమంత అయ్యిందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన చివరి రోజు యుద్ధ విశేషాలను వివరించారు. సర్వసైన్యాధి అయిన శల్యుని, అతడి సోదరుని ధర్మరాజు వధిస్తాడు. సహదేవుడు శకునిని వధిస్తాడు. వికల మనస్కుడైన దుర్యోధనుడు ఒంటరిగా, కాలి నడకన వెళ్లి జల స్తంభన విద్య ద్వారా నీటి మడుగులోకి ప్రవేశిస్తాడు. ఈ వార్త తెలిసిన పాండవులు మడుగు వద్దకు వెళ్లి దుర్యోధనుని యుద్ధానికి ఆహ్వానిస్తారు. తన వారందరూ మరణించారు కనుక, రాజ్యం మీద తనకు ఆసక్తి లేదని, అది పాండవులకే ఇచ్చి వేస్తానని దుర్యోధనుడు అంటాడు. దానంగా ఇచ్చిన రాజ్యాన్ని మేము స్వీకరించ బోమని ధర్మరాజు చెబుతాడు. భీముడు గదతో తొడలు బద్ధలు కొట్టగా దుర్యోధనుడు రణభూమిలో పడిపోతాడని సామవేదం అన్నారు.
20 లోపు ధ్రువపత్రాలు
సిద్ధం చేసుకోవాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 7వ తరగతి మార్కుల సర్టిఫికెట్లను ఈనెల 20వ తేదీ లోపు సిద్ధం చేసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన అన్నారు.
భక్తిశ్రద్ధలతో భోగి


