కల్యాణం.. కడు వైభోగం
స్వామి, అమ్మవార్లకు కల్యాణ వస్త్రాలు తీసుకు వస్తున్న చైర్మన్ రాజు, ఈఓ చక్రధరరావు దంపతులు
వాడపల్లి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు
కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో గోదారంగనాథ స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని క్షేత్రాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భోగి పండగ సందర్భంగా మంట వేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు గోదాదేవిని పెండ్లి కుమార్తెగా, రంగనాథ స్వామిని పెండ్లి కుమారుడిగా అలంకరించి భక్తజనం నడుమ ఆ క్షేత్రంలోని కల్యాణ వేదిక పైకి తోడ్కొని వచ్చారు. స్వామివారికి ఎమ్మెల్యే సత్యానందరావు, చైర్మన్ వెంకట్రాజు, డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు కల్యాణ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ క్రతువును వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ధనుర్మాస వ్రతంలో భాగంగా అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావైని అనుసంధానించి, చివరిగా కల్యాణంతో ముగించి గోదారంగనాథుల కృపకు పాత్రులు కావడం అత్యంత అవశ్యమని పండితులు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలు తిలకించారు. సుమారు రెండు వేల మంది అవివాహితులు యువతీ, యువకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు.
కల్యాణం.. కడు వైభోగం


